‘కృష్ణగారి అబ్బాయి అనే నేను’… భరత్ బహిరంగ సభలో ప్రేక్షకులకు నమస్కారం చెప్పిన తరవాత మహేశ్ చెప్పిన మొదటి డైలాగ్. నెక్స్ట్ డైలాగ్ ఏంటో తెలుసా? ‘తమ్ముడు తారక్ దగ్గర ఈ మాటలన్నీ నేర్చుకున్నా’! మహేశ్ కంటే ముందు మాట్లాడిన ఎన్టీఆర్… ‘నందమూరి తారక రామారావుగారి మనవణ్ణి అయిన నేను’ అంటూ సినిమా టైటిల్‌కి లింక్ చేస్తూ స్పీచ్ మొదలుపెట్టాడు. దాంతో తరవాత మాట్లాడిన మహేశ్… అదే సంప్రదాయాన్ని కొనసాగించాడు. దీనికి బదులుగా ముసిముసి నవ్వులు నవ్వాడు ఎన్టీఆర్.
హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన ‘భరత్ బహిరంగ సభ’ మహేశ్, ఎన్టీఆర్ మధ్య అనుబంధానికి, స్నేహానికి చిహ్నంగా నిలిచింది. “తారక్‌కి గుర్తు వుందో? లేదో? ‘ఆది’ సమయంలో అతని ఆడియో వేడుకకి నేను వెళ్ళా. ఇప్పుడను నా సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు రావడం సంతోషంగా వుంది” అని మహేశ్ చెప్పారు. ఇక నుంచి ప్రతి ఫంక్షన్లో ట్రెండ్ మారుతుందని, హీరోలందరూ మిగతా హీరోల వేడుకలకు వెళతారని సూపర్ స్టార్ మహేశ్ చెప్పారు. “మన ఇండస్ట్రీలో ఐదారుగు పెద్ద హీరోలే వున్నారు. తిప్పి కొడితే ఏడాదికి ఒక్కొక్క సినిమాయే చేస్తాం. అందరి సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బావుంటుంది. మేము మేము బాగానే వుంటాం. మీరు మీరే ఇంకా బాగోవాలి. బాగుండాలి” అన్నారు.
సినిమా గురించి మాట్లాడుతూ… “దర్శకుడు శివగారు కథ చెప్పేటప్పుడు అరగంటపాటు ముఖ్యమంత్రి అన్నారు. నేను చిన్నగా భయపడ్డా. ఎందుకంటే… రాజకీయాలకు, నాకు సంబంధం లేదు. ఎప్పుడూ దూరంగా వుంటాను. పట్టించుకోను. ఒక్కసారిగా ముఖ్యమంత్రి అంటారేంటి? అనుకున్నా. వణుకు వచ్చింది. పూర్తి కథ విన్నాక స్ఫూర్తిమంతంగా అనిపించింది. ఇప్పటివరకూ ఇంతబాగా నేను ఏ చిత్రంలోనూ నటించలేదని అనుకుంటున్నా. ‘శ్రీమంతుడు’ నా కెరీర్లో ఇంపార్టెంట్ ఫిల్మ్. టర్నింగ్ పాయింట్. మళ్ళీ అదే టర్నింగ్ పాయింట్ వచ్చింది. ‘భరత్ అనే నేను’తో రాబోతుంది” అన్నారు.
తొలుత ఏప్రిల్ 27న ‘భరత్ అనే నేను’ని విడుదల చేయాలనుకున్నారు. తరవాత ఏప్రిల్ 20కి సినిమాను షిఫ్ట్ చేశారు. ఈ విడుదల తేదీ మార్పు మహేశ్ బాబుకి ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే… ఆ రోజు ఆయన అమ్మగారి పుట్టినరోజు. “ఏప్రిల్ 20న మా అమ్మగారు ఇందిరమ్మగారి పుట్టినరోజు. అమ్మ అశీసులు, దీవెనలకు మించింది ఏమీ వుండదు” అని మహేశ్ చెప్పారు. మదర్ సెంటిమెంట్ మహేశ్ అభిమానుల గుండెలను తాకింది.