హీరోలపై అభిమానంతో వర్గాల వారీగా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు వేర్వేరు కుంపటిలు పెట్టుకున్నారు. అభిమాన సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. అభిమాన సంఘాల్లో సభ్యులా? కాదా? అనేది పక్కన పెడితే… తెలుగు రాష్ట్రాల్లో హీరోల అభిమానుల మధ్య గొడవలున్నాయ్. నమ్మక తప్పని నిజమైనా… ప్రతి ఒక్కరూ ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే… సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అందరూ గమనిస్తున్నారు. అభిమానుల మధ్య గొడవల కారణంగా ప్రాణాలు పోయిన, ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలను మనం చూశాం. అటువంటివి జరిగిన ప్రతిసారి టీవీ చర్చా వేదికల్లో… “హీరోలందరూ కలిసి మెలిసి వుంటారు. ఒకరితో మరొకరు బావుంటారు. అభిమానులు కలిస్తే బావుంటుంది” అనే మాటలు వింటుంటాం. ఈసారి అటువంటి మాట స్టార్ హీరో నోటి నుంచి వచ్చింది. అదీ మహేశ్ బాబు వంటి సూపర్ స్టార్ నోటి వెంట. ఏదో మొహమాటానికి చెప్పిన మాట కాదది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో కుటుంబానికి చెందిన వారసుణ్ణి తన సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా పిలిచి, వేదికపై అతను వుండగా… చెప్పిన మాట.
మహేశ్ తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ ప్రీ-రిలీజ్ ఈవెంట్… భరత్ బహిరంగ సభకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. అతణ్ణి ‘తమ్ముడు’ అని సంభోదించిన మహేశ్, ‘తారక్ తమ్ముడు వేడుకకు రావడం సంతోషంగా వుంది’ అన్నారు. అంతటితో ఆగలేదు. ఇకపై ఇండస్ట్రీలో ట్రెండ్ మారుతుందని, హీరోలు అందరూ ఇదే విధంగా వేడుకలకు హాజరవుతారని పేర్కొన్నారు. “ఇండస్ట్రీలో ఐదారుగురు పెద్ద హీరోలే వున్నారు. ఒక్కొక్కరూ ఏడాదికి ఒక్కో సినిమా మాత్రమే చేస్తారు. అందరికి సినిమాలు ఆడితే… బావుంటుంది” అన్నారు. తరవాత వీరాభిమానులకు మహేశ్‌బాబు చురకలు అంటించారు. “మేమూ మేమూ (హీరోలం) బాగానే వుంటాం. మీరూ మీరే (అభిమానులు) బాగోవాలి. బావుండాలి” అని చెప్పారు. ఇన్‌డైరెక్టుగా గొడవలు పెట్టుకోవద్దని సెలవిచ్చారు. అభిమానులు సఖ్యతతో మెలగాలని సుతిమెత్తగా చెప్పారు.
స్వతహాగా మహేశ్ చాలా సౌమ్యుడు. ఎవరిపై ఎప్పుడూ ఎలాంటి విమర్శలు చేయరు. ఆయన అభిమానులు సైతం మరో హీరోపై విమర్శలు చేయడాన్ని ఇష్టపడుతున్నట్టు కనిపించడం లేదు. అందుకనే, ‘భరత్ బహిరంగ సభ’లో ఆ విధంగా చెప్పినట్టున్నారు. మహేశ్ అభిమానులు మాత్రమే కాదు… ప్రతి హీరో అభిమాని ఆయన మాటలను సీరియస్‌గా తీసుకుంటే మంచిది! అభిమానులూ… మహేశ్ మాటలు విన్నారా? వింటున్నారా?