మూడు గంటల సినిమాలు ఈమధ్య ఎక్కువయ్యాయి. రెండేళ్లలో తెలుగు తెరపై వచ్చిన బ్లాక్ బస్టర్, భారీ హిట్ సినిమాలు చూస్తే? ‘బాహుబలి2’… 3.17 గంటలు, ‘అర్జున్ రెడ్డి’… 3.02 గంటలు, రంగస్థలం… 3 గంటలు వున్నాయి. కథలో భావోద్వేగాలు చూపించడానికి దర్శకులు కొంత ఎక్కువ సమయమే తీసుకుంటుంన్నారు. పదిహేను రోజుల్లో ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘భరత్ అనే నేను’ విషయంలో మాత్రం దర్శకుడు కొరటాల శివ అంత సమయం తీసుకోవడం లేదు. రెండు గంటల నలభై నిమిషాల్లో కథను చెప్పబోతున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమా నిడివి అంతే. రాజకీయాలు, ప్రేమ, సందేశం, వినోదం.. అన్నిటినీ 2.40 గంటల్లో తెరపై చూపించబోతున్నారు. మహేశ్ బాబు హీరోగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా రన్ టైమ్ ని కొరటాల లాక్ చేశారు. మహేశ్ హీరోగా ఆయన తీసిన ‘శ్రీమంతుడు’ కంటే ఈ సినిమా రెండు నిముషాలు ఎక్కువ వుండబోతుందంతే. స్పెయిన్ లో కొరియోగ్రాఫర్ రాజు సుందరం నేతృత్వంలో లాస్ట్ సాంగ్ తీస్తున్నారు. ఈ నెల 20న విడుదల అవుతున్న ఈ సినిమా బహిరంగ సభ శనివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే.