టైటిల్ బాగుంది కదా అని పెట్టేయకూడదు.
కొన్ని పేర్లు కొంతమందికే సూటవుతాయి.
‘రాజకుమారుడు’ ఈ టైటిల్ ఏ ముహూర్తాన పెట్టారో కానీ.. తొలి సినిమాకే ‘ప్రిన్స్’ అనిపించుకొన్నాడు. తొలి సినిమాకే ఫస్ట్ క్లాస్ మార్కులు పడ్డాయి. ఇక హీరోగా తన మార్క్ చూపించుకోవాలి. ‘సూపర్ స్టార్’కు అసలైన వారసుడు అనిపించుకోవాలి. అదెంతో కాలం పట్టలేదు. ‘ఒక్కడు’ బాక్సాఫీసు లెక్కలు అవాక్కయ్యేలా చేసింది. ‘కుర్రాడంటే ఇలా ఉండాలి కదా’ అని ఫ్యామిలీ ఆడియన్స్ చేత, ‘హీరో అంటే ఇలానే ఉంటాడు కదా’ అని ఇండస్ట్రీ చేత అనిపించింది. ఆ సినిమాతో చిత్రసీమకు మరో స్టార్ ఉద్భవించాడు.
‘మురారి’ మహేష్ చిలిపిదనాన్ని అల్లరిని 70 ఎ.ఎం.లో చూపించింది. మహేష్‌లో స్టార్ మాత్రమే కాదు… ఓ నటుడూ ఉన్నాడన్న ‘నిజం’ దర్శకులకు తెలిసొచ్చింది. అక్కడ్నుంచి మహేష్ వేసిన ప్రతీ అడుగూ.. తనని నెంబర్ వన్ స్థానం వైపు లాక్కెళ్లాయి.
సాధారణంగా గ్లామర్ అనే పదాన్ని అమ్మాయిలకు అన్వయించుకొంటుంటారు. కానీ హీరోల్లో అందం గురించి మాట్లాడుకోవాలంటే… మహేష్ గురించి ప్రస్తావించక తప్పదు. మహేష్ స్క్రీన్ ప్రజెన్స్ థియేటర్లో వైబ్రేషన్స్ తీసుకొస్తుంది. ముఖ్యంగా అమ్మాయిల్లో. అతి పెద్ద లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరోల జాబితాలో మహేష్ పేరు ముందు వరుసలోనే ఉంటుంది. ‘అష్టాచమ్మా’లో స్వాతిలా ‘మహేష్.. మహేష్..’ అంటూ తన నామాన్నే మంత్రంగా జపిస్తుంటారు. అమ్మాయిల్లో మహేష్ కు ఉండే క్రేజ్ అది.
స్టైలీష్ గా కనిపించాలన్నా తనే. ‘అతడు’ అందుకో అద్భతమైన ఉదాహరణ. ఆ సినిమాలో మహేష్ తక్కువే మాట్లాడతాడు. కానీ ఆ మాటలు ఇంపాక్ట్ గా ఉంటాయి. తన చూపులు సైతం.. ఏవో సంకేతాలు పంపిస్తుంటాయి. ఇదంతా త్రివిక్రమ్ చేసిన మ్యాజిక్ కావొచ్చు. కానీ పార్థు పాత్రలో మరో హీరోని ఊహించడం అసాధ్యం.
‘అతడు’లో తక్కువ మాట్లాడిన మహేష్… ‘పోకిరి’, ‘ఖలేజా’కు వచ్చేసరికి స్క్రిప్టులో ఉన్న డైలాగుల్లో సగం నమిలేశాడు. `పోకిరి` మాస్ హీరోయిజానికి ఓ భగవద్గీత లాంటిది. ‘మన హీరో.. పోకిరిలో మహేష్ బాబు లాంటోడు’ అని హీరోలకు స్క్రిప్టు నేరేషన్ మొదలెట్టిన దర్శకులు ఎంతోమంది. ‘ఖలేజా’లో సీతారామరాజుని చూడండి. ఆటోమెటిగ్గా ఓ ఎనర్జీ వచ్చేస్తుంది. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ… మాటల్లేవంతే! ‘ఖలేజా’ బాక్సాఫీసు దగ్గర ఫ్లాప్ అయినా ఆ సినిమా ఎంతోమందికి ఫేవరెట్. ‘అసలు ఆ సినిమా ఎందుకు ఫ్లాపయ్యిందో అర్థం కాదండీ’ అంటుంటారు. దానికి కారణం.. మహేష్ చేసిన మాయ.
మహేష్ సినిమాలు కొన్ని హిట్లు, ఇంకొన్ని సూపర్ హిట్లు, మరి కొన్ని ఊహించని డిజాస్టర్లు అయ్యి ఉండొచ్చు. కానీ… నటుడిగా, స్టార్ గా మాత్రం మహేష్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. వివాదాల విషయంలో మహేష్ ఏనాడూ తలదూర్చడు. అనవసరమైన పబ్లిసిటీ కోరుకోడు. అసలు సోషల్ మీడియాలో తన గురించి ఏమనుకొంటున్నారో పట్టించుకోడు. సినిమాలూ – ఫ్యామిలీ ఇదే అతని జీవితం. అయితే సెట్లో, లేదంటే ఇంట్లో. రిలాక్స్ అవుదామంటే ఫారెన్ ట్రిప్. అది కూడా కుటుంబంతోనే. ఏమాత్రం సమయం చిక్కినా, కుటుంబానికి కేటాయించాలని చూసే హీరో. ది రియల్ ఫ్యామిలీ మాన్.
ధాతృత్వం విషయంలోనూ మహేష్ ఎవ్వరికీ తీసిపోడు. ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు ఆదుకోవడానికి ముందుకొచ్చాడు. వందలమంది పసివాళ్లకు గుండె చికిత్స చేయించి కాపాడాడు. ఊరిని దత్తత తీసుకొని ‘శ్రీమంతుడు’ అనిపించాడు.
కటౌట్ విషయంలో మహేష్ హాలీవుడ్ స్టార్లని ఏమాత్రం తీసిపోడు. తీసే సత్తా దర్శకుల్లో ఉండాలే కానీ, మహేష్ తో హాలీవుడ్ స్టాయి యాక్షన్ సినిమా తీయొచ్చు. బహుశా.. రాజమౌళి ఇప్పుడు అదే చేస్తున్నాడేమో..? అందుకోసమే బాక్సాఫీసు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. వీరిద్దరూ కలిసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గర్వంగా తలెత్తుకొననే సినిమా చేస్తారన్నది అందరి ఆశ, అభిలాష.
ఈ పుట్టిన రోజుకు మహేష్ కొత్త సినిమాల సంగతులేవీ బయటకు రాకపోవడం అభిమానులకు లోటే.
కానీ మహేష్ పాత సినిమాలతో దాన్నీ తీర్చుకోవొచ్చు. ‘మురారి’ని మళ్లీ రిలీజ్ చేసి థియేటర్లకు వదిలారు. ఒకప్పటి మహేష్ అల్లరిని, ఆకతాయితనాన్నీ, చిలిపితనాన్ని మళ్లీ మళ్లీ చూడాలంటే ‘మురారి’ థియేటలో వాలిపోవొచ్చు. మహేష్ నుంచి మరో సినిమా వచ్చేంత వరకూ పాత సినిమాలతో కాలక్షేపం చేయొచ్చు.
వన్స్ ఎగైన్.. హ్యాపీ బర్త్ డే టూ సూపర్ స్టార్!!