‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించాడు సందీప్ రెడ్డి వంగా. ఆ సినిమాని బాలీవుడ్లో తనే తెరకెక్కిస్తున్నాడు. ఈలోగా సందీప్ కి తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. అందులో మహేష్ బాబు తో సినిమా ఒకటి. సందీప్ – మహేష్ ల మధ్య చాలాసార్లు భేటీ జరిగింది. ఓ కథ మహేష్‌కి వినిపించడం, దాన్ని మహేష్ ఓకే చేయడం అయిపోయాయి. మహేష్ డేట్లు ఇవ్వడమే తరువాయి.
అయితే.. ఇప్పుడు ఈ స్క్రిప్టుని మహేష్‌బాబు పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. చాలా రకాలుగా ఆలోచించిన తరవాతే మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. కథ బాగున్నా, ఆ క్యారెక్టరైజేషన్ తన ఇమేజ్‌కి సరిపోదని మహేష్ భయపడుతున్నాడని సమాచారం. ఈ విషయాన్ని సందీప్‌కీ చెప్పేశాడట. ‘ఈ కథ అయితే వద్దు.. భవిష్యత్తులో మాత్రం తప్పకుండా పనిచేద్దాం..’ అని సందీప్‌కి మాట ఇచ్చినట్టు సమాచారం. బాలీవుడ్ `అర్జున్ రెడ్డి` పూర్తయ్యాక తెలుగు సినిమాపై దృష్టి పెడతాడు సందీప్. మరి మహేష్ కోసం రాసుకున్న కథ ఎవరి దగ్గరకు వెళ్తుందో చూడాలి.