తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పుపై సర్కార్ సమాలోచనల నేపథ్యంలో ఆలస్యంగా మేల్కొన్న బీజేపీ తాజాగా కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. చిహ్నంలో ఎలాంటి మార్పులు చేయాలనే అంశంపై ప్రభుత్వానికి సూచనలు చేయకుండా, హిందూ – ముస్లిం అనే మతం ఎజెండాగా సరికొత్త వాదనను బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెరపైకి తీసుకురావడం విమర్శలకు దారితీస్తోంది.
రాచరికపు ఆనవాళ్లను తొలగించాలనుకున్న రేవంత్ రెడ్డి చార్మినార్ ను తొలగించడం కాదని,మొత్తం ముస్లిం పాలకుల ఆనవాళ్లను తొలగించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాచరికపు ఆనవాళ్లను తొలగించడమంటే చార్మినార్ ను తొలగించడమే కాదు…జిల్లాల పేర్లు సైతం మార్చాలనడం ఆసక్తికరంగా మారింది.
ముస్లిం దురాక్రమణదారులు హిందువులపై అరాచకాలు చేసి పాలన సాగించారన్న మహేశ్వర్ రెడ్డి, ఎదులాపురంను ఆదిలాబాద్ గా, లష్కర్ ను సికింద్రాబాద్ గా, ఎలగందులను కరీంనగర్ గా, పాలమూరును మహబూబ్ నగర్ గా, మానుకోటను మహబూబాబాద్ గా, ఇందూర్ ను నిజామాబాద్ గా ముస్లిం పేర్లతో మార్చారని మరి, ఇందులో రాచరికపు పోకడలు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తూ చిహ్నం మార్పు టాపిక్ లోకి మతాన్ని జొప్పించడం తీవ్ర దుమారం రేపుతోంది.
అంటే చిహ్నం మార్పుతో పాటు తెలంగాణలో జిల్లాల పేర్లను కూడా మార్చాలని బీజేపీ ఓ కొత్త డిమాండ్ ను తీసుకొచ్చినట్లుగా స్పష్టం అవుతోంది. అంతేకాదు..బీజేపీ వచ్చాక ముస్లిం పాలకుల ఆనవాళ్లను పూర్తిగా తొలగిస్తామని వ్యాఖ్యానించిన మహేశ్వర్ రెడ్డి.. భవిష్యత్ లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే స్టేట్ ఎంబ్లంను మరోసారి మారుస్తారా అనే చర్చకు తెర లేపారు.