ఏ సినిమా ట్రైలర్, టీజర్ చూసినా ఒకేలా ఉంటాయి. సినిమా కథని, పాత్రల తీరు తెన్నుల్ని చెప్పాల్సిన టీజర్లు, ట్రైలర్లు… అవేం కనిపించకుండా మాయ చేయడానికి చూస్తున్నాయి. హీరోయిజం బిల్డప్ చేసే సీన్లు, ఫైట్లు, పాటలు, స్టెప్పులు, పంచ్ డైలాగులతో.. పూర్తి చేసి `ఇవన్నీ మా సినిమాలో ఉన్నాయి. రండి` అంటారు తప్ప – కథేమిటో, ఆ కథలో కనిపించే ఎమోషన్స్ ఏమిటో చూపించారు. వాటి మధ్య `మజిలీ` కొత్త ట్రైలర్ నిజంగానే కొత్తగా అనిపించింది.
ఇందులో ప్రధాన పాత్రల్ని, వాళ్ల భావోద్వేగాల్ని, ఆ పాత్రలు ప్రవర్తించే తీరుని.. వాటి మధ్య ఉన్న ఎమోషన్స్‌ని పీక్స్‌లో చూపించాడు శివ నిర్వాణ. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేని భర్త, కట్టుకున్నవాడే లోకంగా బతుకుతున్న భార్య… వీళ్ల మధ్య ఎలాంటి ఎమోషన్స్ ఉండొచ్చు? వాళ్ల చుట్టూ నలిగిపోతున్న తల్లిదండ్రులు, స్నేహితుల మానసిక పరిస్థితేంటి? ఇవన్నీ శివ నిర్వాణ బాగానే క్యాప్చర్ చేశాడనిపిస్తోంది. కేవలం ఎమోషన్లు, డైలాగులతోనే రక్తి కట్టించిన ట్రైలర్ ఇది. కథ, పాత్రల్ని ఆ రెండు నిమిషాల్లోనే పరిచయం చేసి, వాళ్లని పూర్తిగా అర్థం చేసుకోవడానికి థియేటర్లకు రమ్మనట్టు ఆహ్వానిస్తున్నట్టుంది ట్రైలర్. ఇదే ఎమోషన్ తెరపైనా చూపించగలిగితే.. మరోసారి నాగచైతన్య, సమంతల జంట మాయ చేయడం ఖాయమనిపిస్తోంది.