కేరళ కుట్టీలెప్పుడూ పద్ధతైన పాత్రలే పోషిస్తుంటారు. ఎక్స్పోజింగ్ కి ససేమీరా అంటారు. నిత్యమీనన్ అందుకు అతి పెద్ద ఉదాహరణ. మాళవిక నాయర్ కూడా అంతే. ఇప్పటి వరకూ చేసినవన్నీ అలాంటి పాత్రలే. కానీ ఒకే తరహా పాత్ర అంటే అవకాశాలు తగ్గిపోతుంటాయి. దానికి తోడు… పోటీలో నిలబడాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాలి. అందుకనేనేమో… `నేను గ్లామర్ పాత్రలకు రెడీ` అంటోంది మాళవిక.
”రోజులు మారుతున్నాయి. ట్రెండ్ ని బట్టి నడుచుకోవాల్సిందే. ఎప్పుడూ ఒకేలా కనిపిస్తానంటే కుదరదు. మనల్ని మనం మార్చుకోవాలి. ఇప్పటి వరకూ నేను ఒకే తరహా పాత్రలు పోషించాను అనుకుంటే.. గ్లామరెస్ పాత్రలు చేయడానికి రెడీనే. అలాగని అంగాంగ ప్రదర్శన చేయమంటే చేయను” అని చెబుతోంది మాళవిక. తన దగ్గరకు కొన్ని వెబ్ సిరీస్ ప్రపోజల్స్ వచ్చాయట. వాటి గురించి కూడా మాట్లాడింది. “వెబ్ సిరీస్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మరీ అంత బోల్డ్ గా కనిపించడం కష్టమే. కానీ మనసుకి నచ్చితే మాత్రం తప్పకుండా అలాంటి పాత్రలూ చేస్తా“ అంటోంది. మాళవికకు దర్శకత్వం అంటే మక్కువ. అందుకు సంబంధించిన టెక్నిక్స్ నేర్చుకుంటోంది. దర్శకత్వం అంటే తనకు ఇష్టమని, తాను సినిమాకి దర్శకత్వం వహిస్తానో, లేదో చెప్పడం కష్టం గానీ, అందుకు సంబంధించిన మెళకువలు నేర్చుకుంటానంటోంది మాళవిక.