విద్యార్థులతో కలిసి డాన్సులు చేసి వార్తల్లో ఉంటారు..! పుట్టిన రోజుకు స్వయంగా పాలాభిషేకం చేయించుకుని వైరల్ అవుతారు..! టీఆర్ఎస్ సభలో జై టీడీపీ అని నినదించి ..నవ్వులు పూయిస్తారు..! పెద్దగా చదువుకోకపోయినా… వేలు, లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి చదవులు చెప్పే కాలేజీలు నిర్వహిస్తూ… స్ఫూర్తిదాయకంగా కనిపిస్తారు.. ఆయన మల్లారెడ్డి. చామకూర మల్లారెడ్డి. సీఎంఆర్ కాలేజీల వ్యవస్థాపకుడు… నిన్నామొన్నటిదాకా దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గమైన మల్కాజిరిగి ఎంపీ. ఇప్పుడు.. తెలంగాణ రెండో ప్రభుత్వంలో మంత్రి.
తెలంగాణ మంత్రివర్గంలో చోటు కోసం చాలా మంది సీనియర్లు.. ఆశతో ఎదురు చూశారు. అధినేతను, ఆయన కుమారుడ్ని.. కలిసి.. పదే పదే విజ్ఞప్తులు చేసుకున్నారు. అయినప్పటికీ.. అనేక మంది సీనియర్లకు అవకాశం దొరకలేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే పలువురు ఎమ్మెల్యేలు.. మంత్రి పదవుల కోసం ఎదురు చూశారు. బీసీ కార్డుతో.. కొంత మంది అడ్వాంటేజ్ సాధించారు కూడా. అయితే.. సామాజిక సమీకరణాలు పెద్దగా కలసి రానప్పటికీ… తొలి సారి ఎమ్మెల్యే అయినప్పటికీ.. మల్లారెడ్డికి మాత్రం మంత్రి పదవి వెదుక్కుంటూ వచ్చింది. నిజానికి తనకు మంత్రి పదవి వస్తుందని మల్లారెడ్డి కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే.. ఎమ్మెల్యే టిక్కెట్టే… నామినేషన్లకు ముందు ఖరారు చేశారు. అయినప్పటికీ.. రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు.. నేరుగా.. మంత్రి అయిపోయారు.
నిజానికి మల్లారెడ్డి… మొదటి నుంచి టీఆర్ఎస్ సానుభూతి పరుడు కారు. ఆయనది తెలుగుదేశం పార్టీ. 2014లో రేవంత్ రెడ్డితో పోటీ పడి మరీ టీడీపీ నుంచి మల్కాజిగిరి టిక్కెట్ దక్కించుకున్నారు. తన ప్లస్ పాయింట్లతో చంద్రబాబును ఆకట్టుకుని మల్కాజిగిరి తానే సరైన అభ్యర్థినని వాదించి మరీ.. టిక్కెట్ దక్కించుకున్నారు. టీఆర్ఎస్తో గట్టి పోటీ ఎదురయినప్పటికీ.. విజయం సాధించారు. ఆ తర్వాత కూడా.. చాలా కాలం పాటు.. టీడీపీలోనే ఉన్నారు. తెలంగాణలో టీడీపీ నిర్వీర్యం అయిపోతోందని తెలుసుకుని… రాజకీయం ప్రదర్శించారు. టీఆర్ఎస్లో చేరిపోయారు. వెంటనే అక్కడ కేసీఆర్ను ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ తో పాటు మంత్రి పదవి కూడా పొందారు. రాజకీయాల్లో… అడుగు పెట్టిన ఐదేళ్ల కాలంలో.. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా మారిపోయిన ఘనత మల్లారెడ్డికి దక్కింది.