మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన ల్యాండ్ ను కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని అక్కడికి వెళ్లి నానా హంగామా చేశారు. మల్లారెడ్డి తన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి అక్కడే ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే బారికేడ్లను మల్లారెడ్డి అనుచరులు తొలగించే ప్రయత్నం చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ సమయంలో మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు పోలిసులతో వాగ్వాదానికి దిగారు. తమ భూమిని కబ్జా చేస్తుంటే ఏం చేస్తున్నారని, మా భూమి కోసం ఆందోళన చేస్తుంటే అడ్డుకుంటారా..? అని పోలిసులతో మల్లారెడ్డి వాదనకు దిగారు.ఆయనకు ఎంత సర్దిచెప్పిన వినకపోవడంతో పోలీసులు మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు.
సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య భూ వివాదం నెలకొంది. అక్కడి రెండున్నర ఎకరాల ల్యాండ్ తనదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా… 1.11ఎకరాల భూమి మాదంటూ మరో 15 మంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం అక్కడికి మల్లారెడ్డి చేరుకోగా.. ఆ 15మంది కూడా అక్కడికి చేరుకోగా ఇరువురు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు కోర్టు సైతం అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వారు మల్లారెడ్డికి తేల్చి చెప్పారు.
ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ల్యాండ్ ఇష్యూ కోర్టులో ఉండగా ఇక్కడ ఎలాంటి గొడవలు చేయవద్దని సూచించినా వినకపోవడంతో మల్లారెడ్డిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.