మాజీ మంత్రి మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మధ్య జరుగుతున్న భూ వివాదం సీఎం వద్దకు చేరింది. ఈ వివాదంలో ఇద్దరూ వెనక్కి తగ్గకపోవటంతో రెవెన్యూ అధికారులు ఇప్పటికే సర్వే కూడా చేశారు. తమ భూమి కబ్జా చేశారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న తరుణంలో తాను సీఎం అపాయింట్మెంట్ అడిగానని, రేవంత్ ను కలిసి అన్ని విషయాలు తేల్చుకుంటానంటూ మల్లారెడ్డి ప్రకటించారు.
సీఎం రేవంత్ తో సమయం కోసం ప్రయత్నిస్తున్న మల్లారెడ్డికి బుధవారం సీఎం అపాయింట్మెంట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తనను కావాలనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇబ్బందిపెడుతున్నారని, ఆ భూమి తనదేనని మరోసారి మల్లారెడ్డి విమర్శలు చేశారు.
తన డాక్యుమెంట్స్ తప్పైతే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని, కాంగ్రెస్ ఎమ్మెల్యే అందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరిన మల్లారెడ్డి… సీఎంతో భేటీలో ఏం మాట్లాడబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. మల్లారెడ్డిపై చాలా చోట్ల భూ ఆక్రమణ ఆరోపణలున్నాయి. ఆయన అల్లుడు కాలేజీ ప్రభుత్వభూమిని ఆక్రమించి కట్టారని మొన్న అధికారులు కూల్చివేతలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి సీఎంతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.