శర్వానంద్ కొత్త సినిమా ‘మనమే’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈనెల 7న విడుదల కాబోతోంది. ప్రమోషన్లు కూడా మొదలెట్టేశారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం మ్యాంగో చేతికి వెళ్లాయి. దాదాపు రూ.27 కోట్లకు నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కొనుగోలు చేసినట్టు సమాచారం. ఆడియో, హిందీ శాటిలైట్ రైట్స్ కూడా ఇందులోనే కలిసిపోయాయి. ఈ సినిమా బడ్జెట్ రూ.30 కోట్లలోపే అని తెలుస్తోంది. అంటే… దాదాపుగా బడ్జెట్ మొత్తం నాన్ థియేట్రికల్ నుంచి వచ్చేసినట్టే. ఇప్పుడు థియేటర్ నుంచి వచ్చిందల్లా లాభమే.
‘మనమే’ కోసం ఓవర్ బడ్జెట్ పెట్టారని, శర్వా కెరీర్లోనే ఎక్కువ ఖర్చు పెట్టి తీశారని ప్రచారం జరిగింది. షూటింగ్ మొత్తం లండన్‌లో జరిగింది. విజువల్స్ రిచ్‌గా కనిపిస్తున్నాయి. అందుకే.. బడ్జెట్ దాటేసిందన్న వార్తలు వచ్చాయి. కాకపోతే, ‘మనమే’ని చాలా పకడ్బందీగా, ఓ ప్లాన్ ప్రకారం తీసినట్టు తెలుస్తోంది. రియల్ లొకేషన్లలో షూట్ చేయడం వల్ల తక్కువ ఖర్చుతో సినిమాని పూర్తి చేయగలిగామని చిత్రబృందం చెబుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే ఓవర్ బడ్జెట్ కు పెట్టింది పేరు. కానీ ‘మనమే’ మాత్రం ఓ ప్లాన్ ప్రకారం, బడ్జెట్ ని కంట్రోల్ చేస్తూ తెరకెక్కించార్ట. అందుకే రిలీజ్‌కు ముందే సేఫ్ అయ్యింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయిక.