నటుడు మోహన్ బాబు వైకాపాకి ఎంత ప్లస్ అవుతారన్న చర్చ కంటే… ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి ఏమాత్రం నష్టం చేయకపోతే చాలు అనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ అనుభవం గురించి మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి కావాలంటే అనుభవం ఉండాలని అంటున్నారనీ, తనకు కూడా మొదట నటుడిగా అవకాశాలు ఇచ్చేముందు ఇలానే నిర్మాతలు అడిగారన్నారు. ఎన్టీఆర్ పక్కన నటించాలంటే అనుభవం కావాలని చెప్పిన నిర్మాతలే చివరికి అన్నగారి పక్కన అవకాశాలిచ్చారనీ, ఇప్పుడు తనొక ప్రూవ్డ్ మేన్ అని చెప్పుకున్నారు. జగన్ కి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, అతడు చేస్తాడో లేదో చూడండి, తరువాత అంతా మీ చేతుల్లోనే ఉందన్నారు. ఒకటో క్లాస్ రెండో కాస్ల్ మూడో క్లాస్.. ఇలా అనుభవం వస్తుందన్నారు.
అంటే… జగన్ కి అవకాశం ఇవ్వడం ఓ ప్రయోగం అనే అర్థంలో మోహన్ బాబు మాట్లాడుతున్నారు. ఒకటి, రెండు, మూడు క్లాసులు… ఇలా అనుభవం వస్తుందన్నారు. కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తెలిసినవారు ఎవరైనా ప్రయోగాల కోసం చూస్తారా..? కేంద్రం నిర్లక్ష్యానికి గురై, సొంత కాళ్ల మీద నిలబడే ప్రయత్నం చేస్తున్న స్థితిలో… ఎదుగుతామని అవకాశం అడిగే వారికి ప్రయోగాశాలగా భావిస్తే ఎలా? ఇక్కడ జగన్ కి అనుభవం రావడం ఆయన రాజకీయ అవసరం. కానీ, ఆంధ్రాకి అనుభవజ్ఞుడైన నాయకుడు రాష్ట్ర అవసరం. ప్రజలు రాష్ట్రం అవసరాలనే చూస్తారుగానీ… ఒక నాయకుడి ఎదుగుదలకు వేదికగా రాష్ట్రం ఉపయోగాపడాలని అనుకోరు కదా. ఈ చర్చకు ఇప్పుడు తెర తీసింది మోహన్ బాబే.
రాజధాని నిర్మాణం గురించి మాట్లాడుతూ… పచ్చని పొలాల మీద కట్టకూడదని ఒక కమిటీ చెప్పిందన్నారు మోహన్ బాబు. పనికి రాని పొలాల్లో కట్టాలన్నారని చెప్పారు. ఒక్క సంవత్సరంలో రాజధాని ఎవ్వడూ కట్టలేడనీ, అది ముప్పై సంవత్సరాలో నలభై సంవత్సరాలో అవుతుందని మోహన్ బాబు చెప్పారు. నలభై ఏళ్లపాటు ఈ పొలాలపై ఏమీ పండించకపోతే, ధాన్యం పండించే ఇలాంటి పొలాలను అభివృద్ధి చెయ్యడానికి ఎన్నేళ్లు పడుతుందని ప్రశ్నించారు.
అంటే… రాజధాని నిర్మాణం ఒక ఏడాదిలో జరిగే పనికాదనీ, దశాబ్దాలు పడుతుందని ఆయనే చాలా స్పష్టంగా చెప్పారు. మరి, జగన్ మొదలుకొని ఆ పార్టీ నాయకులందరూ… ఐదేళ్లో అమరావతి ఎందుకు కట్టలేకపోయావ్ అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుంటారే, విమర్శిస్తారే. అవన్నీ వాస్తవిక దృక్పథం లేనివారు చేసే వ్యాఖ్యలని మోహన్ బాబు చెప్పకనే చెబుతున్నారు. వైకాపా నేతలు చెబుతున్నట్టు కాదు, రాజధాని నిర్మాణమంటే కచ్చితంగా సమయం పట్టే వ్యవహారమే అన్నట్టు తేల్చి చెప్పారు. ఈ చర్చకు ఇప్పుడు తెర తీసింది మోహన్ బాబే.
కేసీఆర్, జగన్ మాట్లాడుకుంటే తప్పా అనీ, తనకు తెలిసినంతవరకూ కేసీఆర్ మంచి చేస్తున్నారని మోహన్ బాబు చెప్పారు. ఆయన రాష్ట్రానికి నువ్వెళ్లి వేలుపెడితే ఎలా అన్నారు. అక్కడ చక్రం తిప్పుతా అనడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు. కేసీఆర్ తో మాట్లాడితే తప్పేంటని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు.
అంటే… తెలంగాణలో టీడీపీ ఉంది కాబట్టి, అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసింది. ఆంధ్రా రాజకీయాల్లో తెరాస ఉంటే, నేరుగా పోటీలోకి దిగితే మోహన్ బాబు వ్యాఖ్యలు సమర్థనీయం. కానీ, ఏపీలో ఉనికి లేని పార్టీ… బీసీలకు నాయకత్వ వహిస్తాననీ, ఇక్కడ రాజకీయాలను మార్చేస్తాననీ అనడం తప్పులేదని మోహన్ బాబు చెబుతున్నట్టుగా ఉంది. ఈ చర్చకు ఇప్పుడు తెర తీసింది మోహన్ బాబే.
చంద్రబాబు వారస్తత్వ రాజకీయాలు చేస్తున్నారన్నారు, మరి జగన్ వచ్చిందీ అదే మార్గంలో కదా? 36 కేసులు అంటున్నావనీ, వాటిలో సగం కొట్టేశారని ఆయన చెప్పారు. అంటే, మిగతా సగం ఉన్నాయని ఆయనే చెబుతున్నట్టు కదా? ఇలాంటి అంశాలే మోహన్ బాబు ప్రెస్ మీట్లో మాట్లాడారు. జగన్ కేసులు, అనుభవం, రాజధాని నిర్మాణం… ఇలా ఆయన మాట్లాడిన మాటల్లో అధిక శాతం వైకాపాకి సెల్ఫ్ గోల్స్ గానే కనిపిస్తున్నాయి.