ఎస్సీ రిజర్వేషన్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడంపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ మూడు దశాబ్దాలుగా చేస్తోన్న పోరాటం ఫలించిందని ఉద్వేగంగా మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణ చేసింది గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అని, ఇప్పుడు ఏపీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండటంతో వర్గీకరణ జరుగుతుందని.. ఇందుకు సహకరించిన చంద్రబాబుకు మందకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు వచ్చేవి కావన్నారు.
Also Read : ఎస్సీ వర్గీకరణకు తొలగిన అడ్డంకులు…
న్యాయం బ్రతికి ఉందంటే చంద్రబాబు తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ ద్వారానే అని మందకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతోపాటు ముప్పై ఏళ్లుగా వర్గీకరణ ఉద్యమానికి మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన ఎమ్మార్పీఎస్ నేతలకు ఈ విజయం అంకితమని, అనుకూల తీర్పునిచ్చిన జడ్జిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విద్యా, ఉద్యోగ,అంశాల్లో ఎస్సీ ఉప కులాల ఆధారంగా వర్గీకరిస్తూ, అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మినహా మిగిలిన ఆరుగురు అనుకూలంగా తీర్పునిచ్చారు. దీనిపై మందకృష్ణ తాజాగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.