మంగళగిరి వైసీపీ దివాలా అంచున ఉంది. ఆపార్టీకి చెందిన నేతలెవరూ ఆ పార్టీ కోసం బయటకు రావడంలేదు. చాన్స్ ఇస్తే టీడీపీ పంచన చేరిపోయిందుకు రెడీగా ఉన్నారు. మురుగుడు, కాండ్రు కుటుంబాలు ఇప్పటికే టీడీపీ గేటు దగ్గర ఉన్నాయి. దానికి సాక్ష్యంగా మురుగుడు హనుమంతరావు లోకేష్ సమక్షంలోనే చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురించారు. ఇక టీడీపీ నుంచి వెళ్లి వైసీపీలో అన్యాయమైపోయిన గంజి చిరంజీవి ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు రెడీ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.
ఎన్నికల సమయంలో పంచేందుకు పెద్ద ఎత్తువ మద్యం తీసుకు వచ్చి తన ఇంటికి సమీపంలో దాచి ఉంచిన ఘటనలో పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారోనని …లోకేష్‌పై పోటీ చేసిన మురుగుడు లావణ్య తండ్రి బిక్కుబిక్కుమంటున్నారు. వైసీపీకి చెందిన ఎవరూ యాక్టివ్ గా లేకపోవడం.. అందరూ ప్రభుత్వ పనుల కోసం తన దగ్గరకే వస్తూండటంతో లోకేష్ వ్యూహం మార్చారు. రాజకీయం చివరి మూడు నెలలే చేస్తానని..మిగతా అభివృద్ధి చేస్తానని అంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మంగళగిరిలో వైసీపీ లేదు. ఆ పార్టీ ఆఫీసులో ఎవరూ ఉండటం లేదు. ఐదేళ్లుగా చేసిన కుట్రలు, రాళ్ల దాడులకు పాల్పడిన వారు ఆజ్ఞాతంలోకి వెళ్లారు. తోక జాడించే వారికి సరైన ట్రీట్ మెంట్ గుంభనంగా చేసేలా లోకేష్ ఏర్పాట్లు చేసుకున్నారని చెబుతున్నారు. అదే సమయంలో ఆయన మంగళగిరి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. మరో నేత వద్దకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం కల్పించడం లేదు.