రెండు అధికార పార్టీల పలుకుబడి పోరాటంలో అధికారులు నలిగిపోతున్నారు. మునుగోడులో రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం మార్పు చేసిన ఎన్నికల గుర్తును యథాతథ స్థితికి తేవాలని ఆదేశించింది. దీనిపై ఆయన దగ్గర నుంచి సీఈవో వివరణ తీసుకోవాలని.. ఆ వివరణను తమకు వెంటనే పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
అసలేం జరిగిందంటే యుగతులసి అనే పార్టీ తరపున శివకుమార్ అనే వ్యక్తి నామినేషన్ వేశాడు. ఆయనకు ఎన్నికల గుర్తుగా రోడ్డు రోలర్‌ను కేటాయించారు. ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత ఆయన గుర్తు హఠాత్తుగా బేబీ వాకర్ గా మారిపోయింది. దీనిపై శివకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇతర పార్టీలు కూడా ఎన్నికల సంఘం పూర్తిగా టీఆర్ఎస్ చెప్పినట్లుగా చేస్తోందని విమర్శలు గుప్పించాయి. ఈ అంశంపై వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. గుర్తులను మార్చొద్దని ఆదేశించింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహంతో .. మరోసారి యుగతులసి పార్టీ అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారు. బ్యాలెట్ పేపర్లను మళ్లీ ప్రింట్ చేస్తున్నారు. ఈవీఎంల మీద పోలింగ్ బూత్‌ల గోడల దగ్గర మాత్రమే బ్యాలెట్ పేపర్లను ఉపయోగిస్తారు. ఇప్పుడు మారిన గుర్తుల ప్రకారం రోడ్డు రోలర్ గుర్తు ఉండనుంది. కారును పోలిన గుర్తుల వల్ల తమకు నష్టం జరుగుతోందని.. ముఖ్యంగా రోడ్డు రోలర్ గుర్తు వల్ల ఇబ్బందులెదురవుతున్నాయని టీఆర్ఎస్ ఈసీ దగ్గర్నుంచి హైకోర్టు వరకూ వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రిటర్నింగ్ అధికారి ద్వారా చక్కబెట్టాలనుకున్నా.. రివర్స్ అయింది. రోడ్డు రోలర్ గుర్తు మళ్లీ తిరిగొచ్చింది.