ఆంధ్రప్రదేశ్ లో మీడియాకు, రాజకీయాలకు ఎంతగానో అవినాభావ సంబంధం ఉంది. మొన్నటిదాకా కేవలం సాక్షి తప్ప మరే ఇతర ఛానల్ మద్దతు లేదంటూ వాపోయిన వైఎస్ఆర్సిపి అభిమానులకు కాస్త హుషారు తెప్పించే వార్తలు ఇప్పుడు మీడియా వర్గాల్లో ను రాజకీయ వర్గాల్లోను చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే ఇప్పటి వరకు ఉన్న ఛానల్స్ లో కొన్ని, కీలకమైన ఈ ఎన్నికల సమయంలో జగన్ కి అనుకూలంగా మారిపోయాయి అన్నది.
రాజకీయాలకు మీడియా కు ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు అయితే కేవలం మీడియాను అడ్డుగా పెట్టుకుని అధికారంలోకి రాగలిగాయి, అధికారంలో మనగలిగాయి. మీడియా లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ఏమైపోయాడో జనాలు ప్రత్యక్షంగా చూశారు. అదే సమయంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ , తమకంటూ ఒక మీడియా సంస్థ ఉండాలనే ఉద్దేశంతో జగన్ ద్వారా ” సాక్షి” నెలకొల్పారు. అయితే సాక్షి ఉన్నప్పటికీ జగన్ 2014లో అధికారంలోకి రాలేకపోయారు. అంతేకాకుండా “పచ్చ మీడియా” అంటూ అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలపై పలుమార్లు విమర్శలు చేశారు. ఆ మధ్య టీవీ9 లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, ” చాలా మీడియా సంస్థలు చంద్రబాబు కు వత్తాసు పలుకుతున్నాయని, తమకు కేవలం సాక్షి సంస్థ మాత్రమే ఉందని” వ్యాఖ్యానించారు. అయితే గతంతో పోలిస్తే కీలకమైన ఈ ఎన్నికల సమయంలో, పలు చానల్స్ జగన్ కి మద్దతుగా మారిపోయినట్టు గా అర్థం అవుతోంది.
టీవీ9 మెత్తబడ్డ డానికి కారణం మేనేజ్మెంట్ మారడమేనా?
చాలాకాలం వరకు టీవీ9 ని నిష్పక్షపాతంగా వ్యవహరించే మీడియా గా జనాలు భావించారు. అయితే గత ఏడాది పవన్ కళ్యాణ్ ని పదేపదే టార్గెట్ చేస్తూ కథనాలు వెలువరించడం, పవన్ కళ్యాణ్ మీద వెకిలి వ్యాఖ్యలు చేసిన కొంతమందిని తమ చానల్లో విపరీతంగా ప్రమోట్ చేయడం, తీవ్ర విమర్శలను తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గత నెల ఏప్రిల్ లో టీవీ9 మీద చేసిన అత్యంత తీవ్ర ఆరోపణలు జనంలోకి బాగానే వెళ్లాయి. దీంతో టీవీ9 కేవలం టీడీపీకి అనుకూలంగా పని చేస్తుంది అన్న భావజాలం జనాల్లోకి బాగా వెళ్ళింది. ఇది జరిగిన కొంతకాలం తర్వాత టీవీ9 లో సింహభాగం వాటా కలిగిన శ్రీనిరాజు ఛానల్ లో తన వాటాను అమ్ముకున్నారు.
అయితే టీవీ9 మేనేజ్మెంట్ మారిన కారణంగానో, మరింకే కారణంగానో ఇటీవల జగన్ పట్ల టీవీ9 వైఖరి కాస్త మెత్తబడ్డట్టు కనిపిస్తోంది. గతంలో జగన్ చేసిన పెద్ద పెద్ద ప్రోగ్రాం ల కి కూడా లైవ్ కవరేజ్ ఇవ్వని టీవీ9, ఈమధ్య జగన్ వార్తలను కవర్ చేసే విషయంలో కాస్త సానుకూలత చూపిస్తోంది. కెసిఆర్ కి అత్యంత ఆప్తుడు అయినా మైహోమ్ రామేశ్వరరావు, అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి సన్నిహితుడిగా ఉన్న “మేఘ ఇంజనీరింగ్” కృష్ణారెడ్డి – వీళ్ళిద్దరూ కూడా టీవీ9 లో భాగస్వాములు అయ్యాకే జగన్ విషయంలో టీవీ9 వైఖరి కాస్త మెత్తబడింది అని కొంతమంది విశ్లేషిస్తున్నారు. టిడిపికి వత్తాసు పలికే విషయంలో పెద్ద అంత మార్పు లేకపోయినప్పటికీ, జగన్ వార్తలను కవర్ చేసే విషయంలో, జగన్ ప్రోగ్రామ్స్ కి లైవ్ ఇచ్చే విషయంలో టీవీ9 లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది అని ఈ వీక్షకులు అంటున్నారు.
మైహోమ్ రామేశ్వరరావు ఆధ్వర్యంలో 10 టీవీ:
జగన్ కి కెసిఆర్ కి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే ఆరోపిస్తున్నారు. కెసిఆర్ ఆమధ్య చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించిన తరువాత, అలాగే కేటీఆర్ , జగన్ ల మధ్య ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చలు జరిగిన తర్వాత ఈ ఆరోపణలు మరీ ఎక్కువయ్యాయి. అయితే టెన్ టీవీ మేనేజ్మెంట్ కూడా ఆ మధ్య మారిపోయింది. టీవీ9 లో కాస్త వాటా కలిగిన మైహోమ్ రామేశ్వరరావు టెన్ టీవీ లో కూడా భాగస్వామిగా మారారు. జగన్ పట్ల టెన్ టీవీ చూపిస్తున్న వైఖరికి ఇదే కారణం అని కొంతమంది విశ్లేషిస్తున్నారు. మేనేజ్మెంట్ మారక ముందు ఈ ఛానల్ కమ్యూనిస్టులకు అనుకూలంగా ఉండేది.
మరి ఆంధ్రజ్యోతి కూడా మారుతుందా?
ఇటీవల దాసరి జై రమేష్ వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ దాసరి జై రమేష్, దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతో ఉన్న వ్యక్తి. విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత. అంతేకాకుండా ఆంధ్రజ్యోతి లో పెట్టుబడి పెట్టిన భాగస్వామి. ఆంధ్రజ్యోతి పత్రిక తెలుగుదేశం పార్టీకి కరపత్రం గా మారిపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. ప్రజల్లో కూడా ఇంచుమించు అలాంటి అభిప్రాయమే ఉంది. మరి ఇప్పుడు దాసరి జై రమేష్, వైఎస్ఆర్ సిపిలో చేరిన కారణంగా, ఆంధ్రజ్యోతి కూడా జగన్ కి అనుకూలంగా కొంత “స్పేస్” ఇవ్వవలసి వస్తుంది అని వైఎస్సార్సీపీ అభిమాన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఎంత వరకు నిజం అవుతుంది అన్నది వేచి చూడాలి.
మొత్తం మీద:
మీడియా అన్నది రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడాల్సిన వ్యవస్థ. జవహర్లాల్ నెహ్రూ దీన్ని ఫోర్త్ ఎస్టేట్ గా అభివర్ణించారు. అయితే దేశం మొత్తం మీద అలా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే మీడియా సంస్థలు వేళ్ళమీద లెక్కించ గలిగినన్ని మాత్రమే ఉన్నాయి. మిగతా సంస్థలన్నీ వాళ్ల యాజమాన్యాలకు అనుకూలంగానో, తమ స్వంత ప్రయోజనాలకు అనుగుణంగానో పనిచేస్తున్నాయి. ఈ పరిస్థితి ఎప్పటికైనా మారుతుందో లేదో చెప్పలేం కానీ, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఈ చానల్స్ అన్నీ జగన్ కి అనుకూలంగా మారడం తనకు ఎంత వరకు లాభిస్తుందన్నది ఎన్నికలయ్యాకే తెలుస్తుంది
– జురాన్ (@CriticZuran)