విజయవాడపై వరుణుడు పగబట్టినట్టే కనిపిస్తున్నాడు. వరద తగ్గుముఖం పడుతోన్న వేళ మరోసారి నగరంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వేగవంతంగా కొనసాగుతోన్న సహాయక కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడుతోంది.
మరోవైపు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని , దీని ప్రభావంతో శనివారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాల… ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే వరద మిగిల్చిన విషాదం నుంచి విజయవాడ ఇంకా పూర్తిగా కోలుకొనేలేదు . ఇప్పుడు మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికతో విజయవాడ వాసులు మరింత ఆందోళనకు గురి అవుతున్నారు.
ఇక, విజయవాడ ముంపు ప్రాంతాల్లో బురదను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నిత్యావసర సరకులను అందజేస్తోంది. ప్రస్తుతం కురుస్తోన్న భారీ వర్షం ఈ పనులకు తీవ్ర ఆటంకంగా మారింది.