Matti Kusthi Movie Telugu Review
తెలుగు360 రేటింగ్ 2.5/5
భార్యాభర్తలు ఇద్దరూ సమానమే – కానీ భర్త కొంచెం ఎక్కువ సమానం.. అని ముళ్లపూడి వారు ఎప్పుడో ఓ సెటైరు వేసేశారు. అన్ని రంగాల్లోనూ సమానంగా ఉన్న మహిళలంటే… కాస్త చులకన భావం. ఓ మగాడు చేసేవన్నీ అమ్మాయిలు చేయగలుగుతున్నా – వాళ్ల బలాన్నీ, చొరవనీ, తెలివితేటల్నీ అర్థం చేసుకోవడానికి, ఒప్పుకోవడానికీ మగాళ్లకు ఈగో అడ్డు వస్తుంటుంది. ముఖ్యంగా భర్తలకు. భార్యంటే ఇలానే ఉండాలి.. ఇలా ఉంటేనే భార్య – అనుకొని, అదే గిరిలో తమ అర్థాంగిని నిలబెట్టాలని చూసేవాళ్లు చాలామంది ఉన్నారు. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే… ఇప్పుడొచ్చిన `మట్టి కుస్తీ` కథ కూడా ఇంచుమించుగా అలాంటిదే. మగాళ్ల ఈగో చుట్టూ తిరిగే కథ. ఓ రెజ్లర్ భార్యగా వస్తే… ఆ మగాడు ఎన్ని ఇబ్బందులు పడతాడో.. నవ్వుతూ చెప్పిన సినిమా ఇది. తమిళం నుంచి డబ్బింగ్ రూపంలో వచ్చింది. రవితేజ నిర్మాత కావడం వల్ల… ఈ సినిమాపై తెలుగువాళ్ల ఫోకస్ పెరిగింది. మరి.. మట్టి కుస్తీ ఎలా ఉంది? దీని కథేమిటి…?
వీర (విష్ణు విశాల్) పల్లెటూరి బైతు. మగాడ్ని అనే అహంకారం ఉంటుంది. పైగా మేనమామ చెప్పే మాటల వల్ల మరింత ప్రేరేపితుడవుతాడు. జడ ఎక్కువగానూ, చదువు తక్కువగానూ ఉండే అమ్మాయిని వెదికి పట్టుకొని, పెళ్లి చేసుకొనే ప్రయత్నాల్లో ఉంటాడు. మరోవైపు కీర్తి (ఐశ్వర్య లక్ష్మి) కథ. బీఎస్సీ చదివింది. తను ఓ రెజ్లర్. అందుకే బార్బీ హెయిర్ తో మగాడిలా ఉంటుంది. కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకోవాలనుకొంటుంది. బారెడు జడ ఉంది.. ఏడో తరగతి వరకూ చదువుకొంది.. అనే రెండే రెండు అబద్ధాలతో… వీరని పెళ్లి చేసుకొంటుంది. వీర కూడా… కీర్తిని బారెడు జడ ఉందని, తన కంటే తక్కువ చదువుకొందని నమ్ముతాడు. మరి ఈ అబద్ధాల కాపురం ఎంత వరకూ సాగింది? నిజం తెలిశాక ఈ బంధం ఏమైంది..? అనేది మిగిలిన కథ.
మట్టి కుస్తీ అనే పేరు చూసి దీన్ని ఓ స్పోర్ట్స్ డ్రామా అనుకొంటారంతా. స్పోర్ట్స్‌కి సంబంధించిన అంశాలు ఉన్నా… సినిమా మొదట్లో కొంచెం సేపు.. క్లైమాక్స్ లో ఇంకొద్దిసేపే ఆ క్రీడా వినోదం. మిగిలినదంతా.. భార్యాభర్తల ఆధిపత్య పోరే. నిజానికి ఇదో సింపుల్ కథ. అబద్ధాల పెళ్లి కాన్సెప్టులు ఇది వరకు చాలా చూశాం. కాకపోతే… ఇందులో కథానాయిక ధీశాలి. ఓ స్పోర్ట్స్ పర్సన్ కావడం… అదనపు హంగులు తీసుకొచ్చింది. పాత్రల పరిచయంతో సినిమా మొదలవుతుంది. పెళ్లి చూపుల తతంగం, అబద్ధాలు ఆడి పెళ్లి చేసేయడం… ఇవన్నీ నవ్విస్తాయి. పెళ్లాల్ని అదుపులో పెట్టడం ఎలా? అని మగాళ్లు.. అసలు మగాళ్లని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అంటూ ఆడాళ్లూ కూర్చుని మాట్లాడుకొనే మాటలు, వాటి మధ్యలో సాగే కామెడీ నవ్విస్తాయి. పెళ్లాం ముందు బిల్డప్పులు ఇవ్వడానికి వీర చేసే ప్రయత్నాలు, క్షవరాన్ని… జడ అని నమ్మించడానికి కీర్తి చేసే పనులు… వీటన్నింటితో తొలి సగానికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. ఇంట్రవెల్ బ్యాంగ్ లో… అందరూ అనుకొన్నట్టే నిజం తెలిసిపోతుంది. అయితే ఆ నిజాన్ని ఓ యాక్షన్ సీన్ తో రివీల్ చేయడం బాగుంది.
సెకండాఫ్ ప్రారంభం నుంచే సీరియస్ డ్రామా వైపు వెళ్లకుండా.. కథని సరదాగానే మొదలెట్టాడు దర్శకుడు. అది కాస్త వర్కవుట్ అయ్యింది. ప్రీ క్లైమాక్స్‌లో మట్టి కుస్తీ నేర్చుకోవడానికి హీరో బరిలోకి దిగడం, కేవలం 15 రోజుల్లోనే కుస్తీ నేర్చుకొని… ఆ ఆటలో కోచ్ స్థాయికి ఎదిగిన వ్యక్తినే హీరో ఓడించడం.. ఇవన్నీ సినిమాటిక్ లిబర్టీస్. అసలు ఓ అమ్మాయి, అబ్బాయి కుస్తీ పోటీల్లో పాల్గొంటారా? ఆ ఛాన్సే లేదు. సినిమా కాబట్టి… ఆ స్వేచ్ఛ తీసుకొని, ఓ పోటీ పెట్టారు. కితకితలు, ఎఫ్ 2 లాంటి సినిమాలు కొన్ని `మట్టి కుస్తీ` చూస్తున్నప్పుడు గుర్తొస్తాయి. కాకపోతే.. తమిళనాట మాస్, మసాలా సినిమాలకు ప్రాధాన్యం ఎక్కువ. అలాంటి జోట.. ఈ జోనర్ కాస్త కొత్తగానే ఉంటుంది. భార్యా భర్తల మధ్య ఆధిపత్య పోరు, ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి చేసే ప్రయత్నాలు ఎవర్ గ్రీన్ ఫార్ములా. అందులోకి స్పోర్ట్స్ డ్రామాని మిళితం చేయడం బాగుంది. కొన్ని రొటీన్ సీన్లు, చూసిన సినిమానే మళ్లీ చూస్తున్న ఫీలింగ్ వచ్చినా.. థియేటర్లో టైమ్ పాస్‌కి ఢోకా ఉండదు.
ఈ సినిమాలో.. విష్ణు విశాల్ పేరుకి మాత్రమే హీరో. అసలు హీరోయిజమంతా ఐశ్వర్య లక్ష్మి చూపించేసింది. తనకు తగిన పాత్ర దక్కింది. రెజ్లర్ గా, అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకొని, ఎక్కడ దొరికిపోతానో అనే భయపడే గృహిణిగా, ఇంట్రవెల్ లో… వీర వనితగా.. ఇలా ప్రతీ చోటా మార్కులు కొట్టేసింది. తాను నిర్మాతగా మారి సినిమా తీస్తున్నప్పుడు ఏ హీరో అయినా… కథలో తన డామినేషన్ ఎక్కువగా ఉండాలనుకొంటాడు. కానీ….విష్ణు విశాల్ మాత్రం హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కథ ఎంచుకొన్నాడు. తను సైడ్ అవ్వాల్సిన చోట.. బుద్ధిగా అయిపోయాడు. హీరోయిన్ని ఎలివేట్ చేశాడు. విష్ణు విశాల్ ఎప్పుడూ కాన్సెప్టు ఓరియెంటెడ్ కథలు ఎంచుకొంటాడు. తొలిసారి మాస్ సినిమా, అందులోనూ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథని ఎంచుకొన్నాడు. హీరో మేనమామ, హీరోయిన్ బాబాయ్… ఈ రెండు పాత్రలూ బాగా పండాయి. వినోదం పంచేది వాళ్లే. అజయ్ ఓ పాత్రలో కనిపిస్తాడు. విలన్ గా బిల్డప్ ఇచ్చే పాత్ర అది. అయితే దాన్ని కూడా కామెడీకే వాడుకొన్నారు.
రొటీన్ కథకు, స్పోర్ట్స్ డ్రామా మిక్స్ చేయడం వల్ల.. మరీ రొటీన్ గా అనిపించలేదు. కామెడీ సీన్లు ఉండడం వల్ల… చూసిన ఎమోషన్ కూడా పాస్ మార్కులు వేయించుకొంది. కాస్టింగ్ అంతా పర్ఫెక్ట్ గా సాగింది. తెలుగు డబ్బింగ్ పై శ్రద్ధ పెట్టారు. పవనిజం, కందురూని పెకాశం పంతులు, పవనిజం.. పదాలు డైలాగుల్లో వినిపిస్తాయి. ఫన్ పండించాల్సిన చోట.. మాటలు బాగా కదిలాయి. పాటలు స్పీడు బ్రేకర్లుగా మారాయి. తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపించింది. మొత్తానికి… థియేటర్లో కాలక్షేపానికి ఎలాంటి లోటూ ఉండదు. జీరో అంచనాలతో వెళ్తే ఇంకాస్త ఎక్కువగా ఆస్వాదించొచ్చు.
షినిషింగ్ టచ్: భార్యాభర్తల కుస్తీ
తెలుగు360 రేటింగ్ 2.5/5