బాహుబలి 2 ధాటికి సినిమాలు విడుదలకు బాగా జంకుతున్నాయి. బాహుబలి మానియాలో ఎక్కక కొట్టుకుపోతామో అని భయపడుతున్నాయి. గత వారం బాబు బాగా బిజీ మాత్రమే వచ్చింది. అది కాస్త ఫ్లాప్ అయ్యింది. ఈసారి మాత్రం మూడు సినిమాలొస్తున్నాయి. రాధ, వెంకటాపురం, రక్షక భటుడు చిత్రాలు ఈ శుక్రవారమే సందడి చేయబోతున్నాయి.
రాధ:
ఈ వారం మూడు సినిమాలొస్తున్నా – టికెట్లు తెగేవి ‘రాధ’కే. శర్వానంద్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ట్రైలర్, పాటలూ జనాల్లోకి వెళ్లిపోయాయి. ట్రైలర్లో కామెడీ పంచ్‌లు చాలు.. జనాలు థియేటర్‌కి వచ్చేయడానికి. మీడియం రేంజున్న హీరో కాబట్టి.. ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. పైగా శతమానం భవతి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా శర్వా బాగా దగ్గరయ్యాడు. రాధ సినిమాపై పాజిటీవ్ బజ్ బాగా నడుస్తోంది. కామెడీ బాగా వర్కవుట్ అయ్యిందని, లాజిక్‌లు వదిలేసి చూస్తే ఈ సినిమా టైమ్ పాస్‌కు గ్యారెంటీ అని తెలుస్తోంది. కాబట్టి.. శర్వా ఓపెనింగ్స్ కొల్లగొడతాడు అనడంలో సందేహం లేదు. కాకపోతే బాహుబలి ఫ్యాక్టర్ ఎంత వరకూ అడ్డు పడుతుందో చూడాలి. సినిమా బాగుంటే మాత్రం.. మంచి వసూళ్లు దక్కించుకోవడం ఖాయం.
వెంకటాపురం
హ్యాపీడేస్ రాహుల్ తొలిసారి ఓ థ్రిల్లర్ చిత్రంలో కనిపించబోతున్నాడు. అదే వెంకటాపురం. గుడ్ సినిమా ఈ సినిమాపై భారీగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ చిత్రంతో వేణు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రచార చిత్రాలు చూస్తుంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఫస్టాఫ్ స్లోగా ఉందని, సెకండాఫ్ వర్కవుట్ అయ్యిందని తెలుస్తోంది. నేరేషన్ కాస్త స్లోగా సాగిందని, అదే ఇబ్బంది పెట్టిందని తెలుస్తోంది. థ్రిల్లర్ సినిమాల్ని ఆస్వాదించే వర్గం రోజు రోజుకీ పెరుగుతోంది. కాబట్టి.. వెంకటాపురంకి నిలదొక్కుకొనే ఛాన్సులున్నాయి.
రక్షక భటుడు
మా సినిమాలో హనుమంతుడెవరో చెప్పుకోండి అంటూ ఓ ఫజిల్ వదిలింది.. రక్షక భటుడు టీమ్. ఈ సినిమాలో హీరో లాంటి క్యారెక్టర్ని దాచి పెట్టి, రక్షక భటుడు టీమ్ సాహసమే చేసింది. ఈ సినిమాపై అంతో ఇంతో ఫోకస్ పెడుతున్నారంటే కారణం. ఈ ప్రశ్నే. రక్ష, జక్కన్న చిత్రాల దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ల ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఆ రెండు సినిమాలూ ఫ్లాపే. ఈసారి ఆయనా ఓ థ్రిల్లర్ కథని ఎంచుకొన్నాడు. బ్రహ్మానందంతో ఓ కామెడీ ట్రాక్ నడించాడట. అదేదో వర్కవుట్ అయ్యేట్టు ఉందని ఇండ్రస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హనుమంతుడు పాత్ర చేసిన నటుడెవరో గానీ.. ఆ పాత్రలో నిజంగా థ్రిల్ ఇస్తే… రక్షక భటుడు సేఫ్ జోన్లో పడతాడు.