కేంద్ర ప్రభుత్వం మీడియాపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇటీవల దేశానికి వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారని పలు యూట్యూబ్ చానళ్లపై నిషేధం విధించిన కేంద్రం సారి ఏకంగా శాటిలైట్ చానల్‌పై గురి పెట్టింది. మలయాళంలో మీడియా వన్ అనే టీవీ చానల్‌ను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ చానల్‌కు ఇచ్చిన లైసెన్స్‌ను రాత్రికి రాత్రి రద్దు చేస్తూ సమాచారం పంపారు. దీంతో ఆ చానల్ ప్రసారాలు ఆగిపోయాయి. కేంద్రం ఆదేశాలపై మీడియా వన్ సంస్థ కేరళ హైకోర్టులో పిటిషన్ వేసి పోరాడుతోంది.
మీడియా వన్ చానల్ నిలుపుదలకు కారణాలేమిటో కేంద్రం జారీ చేసిన నోటీసులో లేవు. రక్షణ పరమైన అంశాలతోనే లైసెన్స్ రద్దు చేస్తున్నట్లుగా తెలిపింది. అదేంటో తమకూ తెలియనది మీడియా వన్ టీవీ చానల్ ప్రతినిధులు చెబుతున్నారు. కేరళలో మత రాజకీయాలకు వ్యతిరేక భావజాల మీడియా ఉంది. బీజేపీని పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉంటారు. మీడియా వన్ చానల్ కూడా ఆ తరహాలోనిదే. అయితే ఆ సంస్థకు అనేక మంది పెట్టుబడిదారులు ఉన్నారు. ఆ పెట్టుబడి దారుల్లో జమాతే ఇస్లామీ అనే సంస్థకు చెందిన వారున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా కేంద్రం నిషేధించినట్లుగా తెలుస్తోంది.
మీడియా వన్ కేరళలో అత్యధికగా ప్రజాదరణ పొందిన టీవీ చానళ్లలో ఒకటి. గతంలోనూ ఈ సంస్థపై ఓ సారి కేంద్రం చర్యలు తీసుకుంది. కానీ తర్వాత న్యాయపోరాటం ద్వారా అనుమతి తెచ్చుకుంది. ఇప్పుడు మళ్లీ అదే బాటలో ఉంది. ఇలా టీవీ చానళ్లను సరైన కారణాలు లేకుండా నిలిపివేయడం సరి కాదని కేరళ మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.