నేరాలు ప్రేమ వ్యవహారాలు వగైరాలపై మన మీడియాకున్న అత్యాసక్తి హైదరాబాద్లో శిరీష ఆత్మహత్య కేసులో మరోసారి బయిటపడింది. ఒక వ్యక్తి ప్రాణం పోయిన తర్వాత కూడా కొత్తగా ఏమీ విషయం లేకున్నా పాత రికార్డులు ఆధారాలు అదేపనిగా ప్లే చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అలాటివి విని ఆనందించే వారికి ఆకర్షణ అంతే. తమ వాదనలకు అనుకూలంగా వాటిని దశల వారిగా లీక్ చేయడం పోలీసుల తప్పయితే దొరికిందే చాలని ప్రసారం చేయడం కొన్ని మీడియా సంస్థల చాపల్యం. ఎందుకంటే కొత్తగా వాటివల్ల సమాజానికి కలిగే లాభం లేదు. సంబంధిత వ్యక్తి ప్రాణాలతో లేరు గనక కేసు దర్యాప్తునకూ ఈ విడుదల వల్ల ఉపయోగం లేదు. ఇలాగే అన్ని కేసుల్లో చేస్తున్నారా అంటే అదీ వుండదు. పైగా వీటివల్ల ఆమె కుటుంబ సభ్యులు కుమార్తె వంటివారిపై ప్రభావం గురించి కూడా ఆలోచించడం లేదు. ఉదాహరణకు శిరీష్ తనకు తేజస్విని సంభాషణల ఫోన్ రికార్డు కావాలని అడిగిన రికార్డు కొత్తగా చెప్పేదేమిటి? ఆమె పై ఆరోపణలను దృవీకరించడానికి కోర్టుకు ఇస్తే చాలు. పోనీ షీలాబోరా కేసులో వలె ఇక్కడేమైనా ఆమె చేసిన దుర్మార్గం వుందా అంటే తనే బలైపోయింది. పోలీసులు మీడియా వారే గాక సమాజం కూడా ఆలోచించాల్సిన అంశాలివి.