అబ్బా..ఏం మాట్లాడావురా ? అంటాడు ఓ సినిమాలో సునీల్. ఏం అర్థమయిందిరా అని ప్రకాష్ రెట్టిస్తే.. ఏమీ అర్థం కాలేదు.. అందుకే ఏం మాట్లాడావురా అన్నానంటాడు. ఇప్పుడు టీవీ9 రజనీ కాంత్ది కూడా అదే పరిస్థితి. అవనిగడ్డలో జగన్ ప్రసంగంలో ఆయనకు ఎవరికీ అర్థం కానంత అర్థం అయింది. అదే ప్రైమ్ టైమ్ డిబేట్లో చర్చకు పెట్టారు. ఆ చర్చకు వచ్చేవాళ్లు ఎవరి వాదన వారు వినిపిస్తారు కానీ.. అంతకంటే ముందే.. తనకు అర్థమయిందేదో రజనీకాంత్ స్క్రీన్ మీద చూపించారు. వాటిని చూసిన వారికి మనం చూస్తున్నది సాక్షినా.. టీవీ9 నా అని టెస్ట్ చేసుకుని ఉంటారు.
జగన్ ప్రసంగంలో టీవీ 9 రజనీకి ఏం అర్థమైందంటే… పవన్ ఆవేశ పరుడు అని జనానికి జగన్ అర్థమయ్యేలా చెప్పారట..! తిట్లపై జనసేనని ఆత్మరక్షణలో పడేశారట !. పవన్ పెళ్లిళ్లతో ముడిపెట్టి వికేంద్రీకరణ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారట..ఇంకా విచిత్రంగా ప్రత్యర్థులు ఏకమవుతున్నారని జగన్ కనిపెట్టేశారట. బీజేపీతో రహస్యం బంధం లేదని చెప్పారట.. ఇలా జగన్ ఒక్క స్పీచ్‌లో రజనీకాంత్‌కు ఎన్నో సమాధానాలు వచ్చాయట. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా ఎలా ఉండే టీవీ9 ఎలా అయిపోయిందని ఎవరైనా అనుకుంటే అది వారి తప్పు కాదు.. టీవీ9దే.
ఇదే రజనీకాంత్ పవన్ కల్యాణ్ ఇటీవల చెప్పు చూపించి విమర్శలు చేయగానే.. రాజకీయాలు మార్చాలనుకుంటారు కానీ..రాజకీయాలే మార్చేస్తాయని ట్వీట్ పెట్టారు. కానీ ఇదే రజనీకాంత్.. వైసీపీ నేతలు కులాలు, మతాలు..రంకులు.. పుట్టుకల్ని ప్రశ్నిస్తూ ఇచ్చే స్పీచ్లనూ లైవ్‌లో చూపిస్తూంటారు. ఇలా ఉంటాయి.. పాత్రికేయ విలువలు. చాలా మంది పేటీఎం చానల్ అని సోషల్ మీడియాలో అభిప్రాయాలు చెబుతున్నా.. అభ్యంతరం చెప్పలేనంతగా దిగజారిపోయింది టీవీ9.