వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్ కత్తాలోని ఆర్జీకార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె ప్రారంభమైంది. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అత్యవసర వైద్య సేవలు మినహ ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది.
దీంతో దేశవ్యాప్తంగా అత్యవసరం కానీ వైద్య సేవలను నిలిపివేసి వైద్యులు ఆందోళనలు చేపట్టారు. ప్రాణం పోసే వైద్యుల ప్రాణం తీస్తారా..? అంటూ నిరసన తెలిపారు. ట్రైనీ డాక్టర్ ను అత్యంత పాశవికంగా హత్యాచారం చేసిన నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలంటూ నినాదాలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ డాక్టర్లు వైద్య సేవలను నిలిపివేసి నిరసన తెలిపారు. ఉదయమే విధులను బహిష్కరించి ఆసుపత్రుల ముందు నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి, తిరుపతిలోని రుయా ఆసుపయ్రిలో నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఉస్మానియా, గాంధీ ఆసుపత్రిలోనూ వైద్యులు విధులను బహిష్కరించారు. కేంద్రం వైద్యుల రక్షణ కోసం కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ తో వైద్యుల నిరసనలు అధికం అవుతుండటంతో ఆర్జీకార్ ఆసుపత్రిలో డాక్టర్ పై హత్యాచారం కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.