మేం తల్చుకుంటే ఉదయగిరిలో తిరగనివ్వబోమని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యర్థులైన వైసీపీ నేతలు బుధవారం సవాల్ చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. తల్చుకుంటామన్న వైసీపీ నేతలు రావాలని.. తాను అక్కడే ఉన్నానని చాలెంజ్ చేశారు. దమ్ముంటే తన దగ్గరకు వచ్చి తల్చుకోవాలని సవాల్ చేశారు. ఎవరైనా వస్తారేమోనని గంటన్నర పాటు కూర్చున్నారు. జనం కూడా మేకపాటిని సవాల్ చేసిన వైసీపీ నేతలు వస్తారేమోనని ఎదురు చూశారు. కానీ ఎవరూ రాలేదు. దీంతో ఎవరు పడితే వారు నాయకులు కాలేరని మేకపాటి సెటైర్లు వేశారు.
మేకపాటి దూకుడుతో ఆయనపై సవాల్ చేసిన వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయినట్లయింది. ఆయన సవాల్ ను తట్టుకుని ఆయన దగ్గరకు వెళ్లి తొడకొడదామని అనుకుంటే ఎటు తిరిగి ఎటుపోతుందోనని అందరూ మిన్నకుండిపోయారు. మేకపాటి వర్గీయులు ఎదురుదాడి చేస్తే పరువు పోతుందని సైలెంట్ గా ఉండిపోయారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దూకుడుగానే రాజకీయం చేస్తారు. ఆయన నోటి నుంచి వచ్చే మాటలు బూతులు మాత్రమే. బూతులు లేకుండాఆయన ప్రసంగం ఉండదు.
అయితే నియోజకవర్గంపై ఆయన పూర్తిగా పట్టుకోల్పోయారన్న ప్రచారం ఉంది. రెండో భార్య వివాదం.. మూడో భార్య.. కుమారుడు వివాదాలు కూడా ఉన్నాయి. ఇంత కాలం ఆయన నియోజకవర్గం దాటి జిల్లా రాజకీయాలు కూడా చేయలేదు. అయితే ఇప్పుడు వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆయన సీఎం జగన్ పైనా సెటైర్లు వేస్తున్నారు. తనపై వైసీపీ నేతలు సవాళ్లను సీరియస్ గా తీసుకున్నారు. దీంతో ఆయన ఏం మాట్లాడతాడో… ఏం చేస్తారోనని వైసీపీ నేతలు టెన్షన్‌కు గురవుతున్నారు.