టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి శాసనమండలి ఛైర్మన్ మోషేనురాజుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఛైర్మన్.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మామూలుగా ఓ ఫిర్యాదు వస్తే విచారణ చేయాలి.. వివరణ తీసుకోవాలి. కానీ అలాంటి చాన్స్ ఇవ్వకుండా అర్థరాత్రి అనర్హతా వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం మారితే ఎలాంటి కక్ష సాధింపులు చేయలేమన్న ఉద్దేశంతోనే ముందస్తుగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మోషేన్ రాజు శాసనమండలి చైర్మన్ అయినప్పటికే ఆయన సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
కనీసం ఆరేడుగురు ఎమ్మెల్సీలు వైసీపీని ధిక్కరించారు. చాలా మంది సైలెంట్ అయిపోయారు. వారిని భయపెట్టడానికే ఇలా అనర్హతా వేటు వేసినట్లుగా విమర్శలు ఉన్నాయి. వైసీపీ నేతలు… తమ పార్టీ నేతల్ని ఎన్నికల ఫలితాల వరకైనా కట్టుదాటకుండా ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కోణంలో వారిని భయపెట్టేందుకు ఇలాంటి నిర్ణయాలను అర్థరాత్రి ప్రకటిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు.