కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. కలసి వచ్చే వారినందర్నీ కలుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలో జేడీఎస్ రూపంలో మిత్రపక్షం రెడీగా ఉంది. ఇతర రాష్ట్రాల్లోని పార్టీలు కూడా బీఆర్ఎస్తో కలుస్తాయని కేసీఆర్ నమ్మకంగా ఉన్నారు. అయితే ఆయన సన్నిహిత మిత్రుడు, గతంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల కూటమికి సహకారం అందించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం ఈ కీలక పరిణామాల్లో ఎక్కడా కేసీఆర్ వెనుక కనిపించం లేదు. దీంతో బీఆర్ఎస్ తో కలిసి మజ్లిస్ నడుస్తుందా అన్న సందేహాలు ఎక్కువగా వస్తున్నాయి.
మజ్లిస్ అధినేత అధికారికంగా తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోరు కానీ.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం పొత్తులు పెట్టుకునే పోటీ చేస్తున్నారు. అయినా బీఆర్ఎస్లో కలిసేందుకు అసదుద్దీన్ ఆసక్తి చూపించడం లేదు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాన్ని పెట్టని కోటగా మార్చుకున్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ కొన్నాళ్లుగా ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేస్తున్నారని ఎన్ని విమర్సలు వచ్చినా వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ఓటమి రుచి చూపించడంలో మజ్లిస్ ఓట్లే కీలకమయ్యాయి. అక్కడ మజ్లిస్ తరపున ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. బీహార్లోనూ గెలిచారు. అలా మజ్లిస్ ముద్ర ఇతర రాష్ట్రాల్లో కనబడుతున్న సమయంలో బీఆర్ఎస్ నీడలో ఎందుకని ఓవైసీ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఓవైసీకి కొన్ని మెరుగైన ఫలితాలతోపాటు చాలా చోట్ల కనీస ఓట్లు రాని పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ ఓవైసీ ఏ మాత్రం నిరాశపడకుండా జాతీయ స్థాయిలో తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. అదే సమయంలో తెలంగాణలోనూ తమ పార్టీ ఎమ్మెల్యేలను పది మంది వరకూ పెంచుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు.
అయితే కేసీఆరే.. వ్యూహాత్మకంగానే మజ్లిస్ ను దూరం పెట్టారని .. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కనబడకుండా చేస్తున్నారని చెబుతున్నారు.మజ్లిస్ అంటే పూర్తిగా ముస్లింలకే పరిమితమైన పార్టీ. హిందూత్వ రాజకీయాలు ఇప్పుడుజోరుగా నడుస్తున్నాయి. పొరపాటున మజ్లిస్ స్నేహ పార్టీగా ముద్ర పడితే.. బీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అంటున్నారు. అందుకే కేసీఆర్ దూరంగా ఉంచుతున్నారని.. అవసరమనప్పుడు కలుపుకుంటారని చెబుతున్నారు.