మంత్రి గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడగా , ఆయన లేవనెత్తిన అంశాలపై పాయింట్ టు పాయింట్ తిప్పి కొడుతూ కౌంటర్ ఇస్తున్నారు జనసైనికులు. వివరాల్లోకి వెళితే..
తాజాగా మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్, తనకు జగన్ మంత్రి పదవి ఇచ్చారన్న కృతజ్ఞతతో, ప్రతిపక్ష పార్టీలపై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి అమర్నాథ్. పవన్ కళ్యాణ్ బహు భార్యలు కలిగి ఉన్నారంటూ అసంబద్ధమైన వ్యక్తిగత విమర్శలు చేసిన మంత్రి, అనేక పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ పొత్తుల లో ప్రపంచ రికార్డు స్థాపించారని ఎద్దేవా చేశారు.
అయితే అమర్నాథ్ పై జన సైనికులు అదే స్థాయిలో కౌంటర్ విమర్శలు చేస్తున్నారు. ఈయన గారి తండ్రి కాంగ్రెస్ లో పని చేస్తే, తల్లి గారు తెలుగుదేశం పార్టీలో చేరారని గుర్తు చేశారు. ఈయన కూడా మొదట్లో తెలుగుదేశం పార్టీ తరఫున వార్డు మెంబర్ గా పని చేశాడని, భవిష్యత్తులో టిడిపి కి వెళ్తాడో బీజేపీ కి వెళ్తాడో తెలియని ఈయన పవన్ కళ్యాణ్ పార్టీ పొత్తుల గురించి వ్యాఖ్యలు చేయడం గురువింద గింజ సామెత గుర్తు చేస్తోందంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో గెలవడానికి ఈయన ఏ రకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారో వివరిస్తూ జనసైనికులు అమర్నాథ్ ని సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్ లో చెడుగుడు ఆడుకున్నారు.
ఏది ఏమైనా తన తండ్రి గారు ఒక పార్టీలో, తల్లి గారు ఒక పార్టీలో గతంలో పని చేయగా ఈయన మూడో పార్టీలో ఉంటూ, తరచుగా పార్టీలు మారే కుటుంబం అన్న అపప్రధ ని మోస్తూ, పవన్ కళ్యాణ్ పార్టీ పొత్తుల గురించి వెటకారంగా మాట్లాడటం పై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.