మంత్రి గారి భార్య పోలీసులపై చేసిన రుబాబు వీడియోతో సహా వెలుగులోకి వచ్చింది. అదేదో కావాలని సన్నివేశాన్ని సృష్టించుకున్నట్లుగా ఉంది. వీడియో పక్కాగా ఉంది. ఈ వ్యవహారంతో కడప మంత్రి రాంప్రసాద్ రెడ్డికి తొలి ఇన్నింగ్స్ లోనే మచ్చ పడింది. చంద్రబాబునాయుడు కూడా వెంటనే సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగులు, పోలీసుల పట్ల అలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైసీపీ హయాంలో ఇలాంటివి కామన్. పోలీసుల్ని .. పోలీస్ స్టేషన్ లోనే కొట్టినా పట్టించుకునేవారు ఉండరు. కేసులు ఉండవు. రివర్స్ లో పోలీసులపైనే కేసులు పెట్టేవారు. కానీ వైసీపీ చేసిందని.. టీడీపీ చేస్తే పెద్ద తేడా ఏముందన్న అభిప్రాయం బలపడుతుంది.
అధికారం అందిన అహంలో తాము ఏం చేసినా బండి నడుస్తుందని టీడీపీ నేతల కుటుంబసభ్యులు అనుకుంటారు. వారిని కంట్రోల్ చేయాల్సింది బాధ్యతల్లో ఉన్న వారే. తాము చేసే పనుల వల్ల తమకు ఎలాంటి మేలు జరగకపోగా పార్టీకి నష్టం వస్తుంది. అధికారం లేని దర్పం ప్రదర్శిస్తే ప్రజలకు కూడా దుర్వినియోగం చేస్తున్నారన్న కోపం పెరుగుతుంది. మంత్రికి తప్ప ఆయన కుటుంబసభ్యులకు ప్రోటోకాల్ ఉండదు. ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఓ జిల్లాకు మంత్రి అంటే.. కుటుంబ సభ్యులు కూడా తామే మంత్రులం అన్నట్లుగా వ్యవహరించడం కామన్‌గా మారిపోయింది.
ఈ పరిస్థితిని ఇప్పుడు మార్చాల్సి ఉంది. అధికారం అనేది ప్రజలు ఇచ్చేది. ప్రజలు దుర్వినియోగం చేస్తే మళ్లీ లాగేసుకుంటారు. చరిత్ర ఇదే చెబుతోంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని టీడీపీ కూటమి నేతలు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. ఉద్యోగులు తప్పు చేసినా వారిని దూషించడానికి రాజకీయ నేతలకు అవకాశం లేదు. చట్టప్రకారం… సర్వీస్ రూల్స్ ప్రకారం వారు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా తామే తప్పు చేస్తే… ప్రజల శిక్షకు గురవుతారు.