కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నా ఒకరిద్దరూ మంత్రులు మినహా మిగతా వారెవరూ పెద్దగా స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికి రేవంత్ ఒక్కడే కౌంటర్ ఇస్తున్నారు తప్పితే మంత్రివర్గం పెద్దగా రియాక్ట్ కావడం లేదు అని కాంగ్రెస్ పార్టీలోనే ఓ చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వంపై, కేసీఆర్ పై విమర్శలు వస్తే నాడు మంత్రులంతా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కడిగిపారేసేవారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ మంతివర్గం మాత్రం ఎదురుదాడి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సీఎం రేవంత్ టార్గెట్ గా బీఆర్ఎస్ , బీజేపీ విమర్శల దాడి కొనసాగిస్తున్నా పెద్దగా కౌంటర్లు ఇవ్వడం లేదు. ప్రభుత్వం కూలుతుందని, ఆగస్ట్ సంక్షోభం తప్పదని హెచ్చరిస్తున్నా ఏమి పట్టనట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.అసలు మంత్రులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు..? అనేది బిగ్ డిబేట్ గా మారింది.
లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ ఆరోపణలతో బీజేపీ అగ్రనేతలతో సహా రాష్ట్ర నేతల వరకు అంతా సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ, ఒకరిద్దరూ మంత్రులు మినహాయిస్తే మంత్రులు పెద్దగా బీజేపీకి కౌంటర్లు ఇవ్వలేదని ఆ పార్టీలోనే మంత్రులపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అన్నింటికి రేవంత్ ఒక్కడే సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే కేబినెట్ ను విస్తరణ ఉండటంతో అందులో తనకు మద్దతుగా నిలిచే వారికి రేవంత్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.