వైసీపీ ఎమ్మెల్యేలు నేరుగా సీఎం జగన్ పై తిరుగుబాటు చేస్తున్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్, ఆనం రామనారాయణరెడ్డి, రాచమల్లు ప్రసాదరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్.. ఇలా చెప్పుకూంటూ పోతే… సీఎం జగన్ పాలపపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. చాలామంది లోలోపలే మథనపడుతున్నారు. ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో బయటపడుతున్నారు. దీంతో వైసీపీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది.
రఘురామ పరిస్థితి చూస్తూ కూడా గళమెత్తుతున్న ఎమ్మెల్యేలు !
సీఎం జగన్ లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే విపక్షాలు కూడా భయపడే పరిస్థితి. అంత దారుణమైన రాజకీయ వాతావరణం ఉంది. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న రఘురామ పరిస్థితి చూసి కూడా ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదు. రోజుకొకరు జగన్ పాలనపై అసహనం వ్యక్తం చేయడంతో అధికారపార్టీలో చర్చకు తావిస్తోంది. ప్రస్తుతం పెన్షన్ల కోతపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న జగన్ ప్రభుత్వానికి ఎమ్మెల్యేల విమర్శలు మరింత చికాకును తెప్పిస్తున్నాయి.
అన్నీ బటన్లు సీఎం నొక్కితే ఎమ్మెల్యేలకు విలువేంది ?
నవరత్నాల పథకాలు అన్నీ సీయం బటన్ నొక్కితే అవుతున్నాయి. అన్నీ సీఎం ఇస్తున్నారని వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారు.క్రెడిట్ ఆయనకే వెళుతోంది. మరి ఎమ్మెల్యేలు ఎందుకు అని వైసీపీలో కొన్నాళ్ల నుచి ఆవేదన వ్యక్తమవుతోంది. అందుకే ట్యాబ్స్ మీరు పంపిణీ చేయండి అని జగన్ వారికి ఆఫర్ ఇచ్చారు. కానీ ఇప్పటికే ఎమ్మెల్యేలకు విలువ పడిపోయింది. ప్రొద్దూటురు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ కూడా టీచర్లు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని చెప్పడంతో ఆపార్టీలో కల్లోలం మొదలైంది.
ఐ ప్యాక్ ప్రతినిధుల అతితో మరింత ఆగ్రహం !
ఇటీవల వైసీపీ నేతలు… పరిశీలకుల్ని నియమించారు.వారితో పాటు ఐ ప్యాక్ ప్రతినిధి ఒకరు నియోజకవర్గంలోనే తిష్టవేసి.. ఎమ్మెల్యేలతో పాటు తిరుగుతున్నారు. ఆనంతో పాటు తిరుగుతున్న ఐ ప్యాక్ ప్రతినిధి.. ఆయన అందర్నీ కలుపుకుని వెళ్లాలని చెప్పడంతో పాటు ఏం చేయాలో సలహాలిస్తూండటంతో మండిపోయిందని అంటున్నారు. అందరూ ఎమ్మెల్యేలకు ఐ ప్యాక్ ప్రతినిధి ఓ షాడోలా ఉంటున్నారు. దీంతో ఇదేం ఖర్మ అనుకోవడం వారి వంతయింది. ఈ అసంతృప్తి కూడా బయటపడుతోంది.
బాగా కట్టడి చేసిన అసమ్మతి… అసంతృప్తి ఒక్క సారిగా బయటపడితే కంట్రోల్ కావడం కష్టం. ఇప్పటి వరకూ జగన్ కంట్రోల్ చేసుకున్నారు కానీ.. ఇప్పుడు బయటపడటం ప్రారంభమయింది. ఎక్కడ వరకు చేరుతుందో చెప్పడం కష్టం.