50 శాతం ఓట్లు.. 80 శానికిపైగా సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాలుగేళ్లలోనే అత:పాతాళానికి దిగిపోయింది. స్థానిక ఎన్నికల్లో తిరుగులేని విజయాలు నమోదు చేసి ఇక ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు మా వైపే అని చెప్పుకుంటూ వచ్చారు. అయినా ఏ ఎన్నిక జరిగినా దొంగ ఓట్లను… డబ్బులు పంచడాన్ని మాత్రం వదిలి పెట్టలేదు. చివరికి విపక్షాలు పోటీలో లేని ఆత్మకూరు ఉపఎన్నికలోనూ డబ్బులు పెంచారు. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేసిన అరాచకాలు కళ్ల ముందే ఉన్నాయి. కానీ గెలవలేకపోయారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రజలు డిసైడ్ చేసుకుంటే ఏమీ కాపాడవు !
వాలంటీర్లు ఉన్నారు. సచివాలయ వ్యవస్థ ఉంది. గృహసారధులు ఉన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటర్లపై నిఘా పెట్టారు. భయపెట్టి ఓట్లేసుకుంటాం. ఇంకా చాలదు అనుకుంటే ప్రత్యర్థుల ఓట్లు తీసేస్తాం… దొంగ ఓట్లు కలుపుకుంటాం లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో జరిగింది అదే. ఎన్ని అక్రమాలు చేసినా టీడీపీకి భారీ మెజార్టీలు వచ్చాయి. వాలంటీర్లు కాపాడలేకపోయారు. భారీగా పట్టు ఉన్న రాయలసీమలో పరిస్థితి ఇలా ఉందంటే.. .. సీన్ ఎంత మారిపోయిందో సులువుగా అర్థం చేసుకోవచ్చు.
అధికార అహంకారాన్ని ప్రజలు అణిచి వేస్తారు !
అధికారంలోకి వచ్చినప్పటి నుండి అహంకారమే తప్ప… బాధ్యత అనేది చూపని ప్రభుత్వం ఇది. ప్రత్యర్థులపై దాడులు… ప్రజలను పీడించడం.. భయపెట్టడం మాత్రమే చేస్తూ రాజకీయం చేస్తోంది. అభివృద్ధి లేదు. సంక్షేమం అంటే ఓటు బ్యాంకుకు కొంత డబ్బులు జమ చేయడం అన్నట్లుగా మారిపోయింది. ఆ డబ్బులు మళ్లీ మద్యం పేరుతో పిండేసుకుంటున్నారు. అంటే ప్రజలెవరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చకపోగా వారిని మరింతగా అప్పుల పాలు చేస్తున్నారు. పైగా మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే నాటకం. ఈ అహంకాన్ని ప్రజలు అణిచి వేస్తారు. దానికి సంకేతమే పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు.
నిజాలు తెలుసుకోకపోతే నట్టేట మునగడమే క్లైమాక్స్ !
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తాము ప్రజా రంజకంగా పరిపాలిస్తున్నామన్న ఓ రకమైన అభిప్రాయంలో ఉంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదని తాజా ఎమ్మెల్సీ పరిణామాలతో అర్థమైపోతుంది. ప్రత్యర్థులపై రాజకీయ దాడులు ఆపి ప్రజలకు అత్యధిక సమయం కేటాయించాల్సి ఉంది. అధికార దుర్వినియోగాన్ని నిలిపివేయాలి. మూడు రాజధానుల రాజకీయానికి తెర దించాలి. ఎందుకంటే.. అమరావతిని కాదని అక్కడ వ్యతిరేకత మూట గట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు విశాఖలో కూడా సానుకూలత లేకపోతే రెంటికి చెడ్డ రేవడి అయిపోతుంది పరిస్థితి. రాయలసీమలో ఓటింగ్ చూసిన తర్వాత వైసీపీకి అసలు సమస్యేమిటో తెలుసుకోకపోతే ఎవరు కాపాడగలరు?