పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీలో కాక రేపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిన వారు ఆయన ఎన్నికలు జరిగిన తొమ్మిది జిల్లాల్లోని మంత్రులందర్నీ తీసేస్తారని ఈ విషయంలో ముందూ వెనుకా ఆలోచించరని నమ్ముతున్నారు. చిన్న ఓటమిని కూడా జగన్ సహించరని అంటున్నారు. ఆ ప్రకారం ఉత్తరాంధ్ర మంత్రులందరికీ ఊస్టింగ్ తప్పదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్ల పదవులకు గండం పొంచి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇటీవల కేబినెట్ భేటీలో అన్ని స్థానాల్లో గెలుస్తామని చెప్పిన తర్వాత మూడు, నాలుగు వికెట్లు పడతాయని జగన్ అన్నారు. ఇప్పుడు మూడు పట్టభద్రుల స్థానాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అదీ కూడా ప్రతిపక్షానికి ఏకపక్ష ఫలితాలు వచ్చాయి. తమకు తిరుగు ఉండదనుకున్న పశ్చిమ రాయలసీమలో పరిస్థితి చూసి ఆ పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. అందుకే… ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం మంత్రుల్ని సాగనంపవచ్చని చెబుతున్నారు.
సీఎం జగన్ కు తాను గొప్పగా మీటలు నొక్కుతున్నానని ఏదైనా తప్పు జరిగితే అది ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, మంత్రులేదనని నమ్మకం. అందుకే ఆయన ఎన్నికల్లో ఓటమి లాంటి పరిస్థితులు వస్తే… ముందుగా వారిపై వేటు వేస్తారు. ఇప్పటి దాకా మూడు అనుకున్న వికెట్లు.. ముందు ముందు పది వరకూ పెరిగినా ఆశ్చర్యం లేదని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే సీఎం జగన్ నియోజకవర్గం పులివెందులలో కూడా పట్టభద్రుల ఓటర్లు వైసీపీకి ఓటేయలేదు. మరి ఆయన రాజీనామా చేస్తారా అనే సెటైర్లు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. కానీ వైసీపీ హైకమాండ్ సిద్దాంతం మొదటి నుంచి ఒక్కటే.. తాము చేసేదే సంసారం అని. అందుకే జగన్ కు అలాంటి ఆలోచనలు రావని అనుకోవచ్చు.