ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ… ఈడీ, సీబీఐ కేసులతో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఇప్పటికే కింది కోర్టుల్లో తన బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో, కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
కవిత పిటిషన్ పై సుప్రీం ద్విసభ్య బెంచ్ విచారణ జరపనుంది. జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత బెయిల్ పిటిషన్ ను విచారించనుంది.
17నెలల పాటు ఇదే కేసులో జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఇదే బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణ సందర్భంగా… ఇంకా ఎంత కాలం ఓ వ్యక్తిని జైల్లో పెడతారు, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది… విచారణ త్వరగా పూర్తి చేయాల్సిందేనంటూ కామెంట్ కూడా చేసింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇదే బెంచ్ మీదకు కవిత పిటిషన్ విచారణకు వస్తుండటంతో బెయిల్ వస్తుందన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలున్నారు.
పైగా, కేటీఆర్ కూడా వచ్చే వారం కవితకు బెయిల్ వస్తుంది అని నమ్మకంగా చెప్పారు. ఇప్పటికే సీనియర్ లాయర్లతో కేటీఆర్, హరీష్ రావులు చర్చలు జరిపారు. కేసును విచారించే ధర్మాసనం కూడా సిసోడియా కేసులో విచారణ జరిపి ఉన్న నేపథ్యంలో… అదే రిజల్ట్ వస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా సోమవారం బీఆర్ఎస్ కు బిగ్ డేగా మారనుంది.