కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కవిత… కింది కోర్టుల్లో వేసిన బెయిల్ పిటిషన్లను కోర్టులు కొట్టివేయగా, సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఎమ్మెల్సీ కవిత తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహ్గతీ వాదిస్తున్నారు. గత రెండు విచారణల సందర్భంగా కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వనప్పటికీ… రెగ్యూలర్ బెయిల్ పై వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. గత విచారణ సందర్భంగా ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవటంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వానాథన్ ల బెంచ్ ఈ బెయిల్ పిటిషన్ వాదనలు విననుంది. ఇదే బెంచ్ లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఇదే లిక్కర్ కేసులో బెయిల్ రావటంతో బీఆర్ఎస్ కవిత బెయిల్ పై ఆశలు పెట్టుకుంది. పైగా, ఓ వ్యక్తిని ఎన్ని రోజులు జైల్లో పెడతారు? ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటమే అంటూ కామెంట్ చేసిన నేపథ్యంలో… ఈ పాయింట్ తోనే రోహ్గతీ వాదనలు వినిపిస్తున్నారు.
మహిళ, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు పైగా తను మార్చి నుండి జైల్లోనే ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరఫు లాయర్లు వాదిస్తుండగా, కింగ్ పిన్ అయిన కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ-ఈడీ వాదిస్తోంది.
కవితకు బెయిల్ వస్తుందన్న నమ్మకంతో ఉన్న బీఆర్ఎస్ నేతలు… ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.