ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ… 5 నెలలుగా జైల్లో ఉంటున్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిరాకరించింది.
ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారు, ఓ ప్రజాప్రతినిధిగా, మహిళ అయిన కవితను ఇంకెంత కాలం జైల్లో ఉంచుతారు అంటూ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇప్పటికే బెయిల్ పొందిన మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ కేసులను ఉదహరించారు.
అయితే, రోహత్గీ వాదనల సందర్బంగా… కేసు పెట్టిన ఈడీ, సీబీఐలకు తాము నోటీసులు జారీ చేస్తామని జస్టిస్ గవాయి స్పష్టంగా చేయగా, కనీసం మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వండి అని కవిత లాయర్ రోహత్గీ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
ఇందుకు జస్టిస్ గవాయి నిరాకరించారు. వారి అభిప్రాయాలను వెల్లడించిన తర్వాతే వాదనలు వింటామని, అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేస్తూ… తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేశారు. ఈ లోపు అఫిడవిట్ ఫైల్ చేయాలని ఈడీ, సీబీఐలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే కవిత బెయిల్ పిటిషన్లను కింది కోర్టులు కొట్టివేశాయి. మహిళ అనే కారణంగా బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని, అత్యంత ప్రభావం చూపే వ్యక్తిగా కవితను దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.