ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. కానీ తెలంగాణలో మాత్రం పోటీ తప్పడం లేదు. ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఐదు నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది. వీరందరూ పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగు దేశం పార్టీ నుండి యనమల రామకృష్ణుడు , పి. అశోక్‌బాబు., దువ్వారపు రామారావు, బీటీ నాయుడు ఎమ్మెల్సీలు అయ్యారు.
వైసీపీ నుంచి జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ అయ్యారు. కానీ తెలంగాణలో మాత్రం.. ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం…ఎంఐఎం, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగానే ఉన్నట్టు నిర్థారించారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ల వేసిన..జాజుల భాస్కర్ నామినేషన్ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో తిరస్కరించారు. దీంతో పోలింగ్ తప్పనిసరిగా మారింది. మార్చి 12న పోలింగ్ జరుగనున్నది. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి, ఫలితాలు వెల్లడిస్తారు.
కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్సీని గెలిపించుకోవడం జీవన్మరణ సమస్యలా మారింది. ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు అవసరమైన బలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాస్తంత వ్యూహాత్మంగా… ఎమ్మెల్యేలంతా.. పార్టీకి కట్టుబడి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. శాసన సభ్యుల సంఖ్యప్రకారం ఒక్కో ఎమ్మెల్సీకి 21మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేల బలం 98. ఐదు ఎమ్మెల్సీ స్థానాలు గెలవాలంటే 105మంది ఎమ్మెల్యేలు అవసరం. అంటే ఈ లెక్కన టిఆర్ఎస్ నాలుగు స్థానాలు గెలవడానికి అవసరమైన బలం ఉంది. ఐదో స్థానానానికి మరో ఏడు మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. కాంగ్రెస్ కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి ఇద్దరు ఉన్నారు. దాంతో కాంగ్రెస్ బలం 20అవుతుంది. కాంగ్రెస్ కు ఒక ఎమ్మెల్యే తక్కువగా ఉంటారు. అయితే ఎలిమినేషన్ పద్దతిలో లెక్కింపు ఉంటుంది కాబట్టి శాసన సభ్యులు అందరూ వోటింగ్ లో పాల్గొంటే మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు అవకాశం లేకుండానే కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన ఎవరైనా ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరైతే టిఆర్ఎస్ మిత్రపక్షంతో కలిసి ఐదు ఎమ్మెలసీలను గెలుచుకుంటుంది. దీని కోసం ఇప్పటికే టీఆర్ఎస్ స్కెచ్ ప్రారంభించింది.
టీఆర్ఎస్ ఆ ఒక్క ఎమ్మెల్సీని కూడా కాంగ్రెస్ గెలుచుకోకుండా ఎందుకు చేయాలనుకుంటుందంటే.. శాసనమండలిలో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయడానికేనని చెప్పవచ్చు. ప్రస్తుతం మండలిలో కాంగ్రెస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పదవీకాలం ఈ నెల29తో ముగుస్తుంది. మిగిలిన వాళ్లు టీఆర్ఎస్లో చేరిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న గూడూరు నారాయణరెడ్డి గెలవకపోతే.. మండలిలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. ఈ లక్ష్యంతోనే టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది.