హైదరాబాద్ లో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాల్ డాటాని తమకు అందించాలని కోరుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు విజయవాడ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై స్పందిస్తూ వారిని ఆ వివరాలు కోర్టులో సమర్పించాలని ఇంతకు ముందు ఆదేశించింది. కానీ కాల్ డాటాను ఎవరికీ ఇవ్వవద్దని మెమో ఫెయిల్ చేసిందని, ఒకవేళ తన ఆదేశాలను ధిక్కరించి కాల్ డాటాను ఎవరికయినా ఇచ్చినట్లయితే ప్రాసిక్యూట్ చేస్తామని తమను హెచ్చరించినట్లు సర్వీస్ ప్రొవైడర్లు కోర్టుకి తెలియజేసారు.
కానీ కోర్టు ఆదేశించినప్పటికీ వారు కాల్ డాటాని ఇవ్వడానికి నిరాకరించడం కోర్టు ధిక్కారంగానే పరిగణించాలని, ఐపిసి సెక్షన్ 174 ప్రకారం అది నేరమని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ వాదించారు. రెండు నెలల తరువాత కాల్ డాటా చెరిగిపోతుంటుంది కనుక తాము కోరిన కాల్ డాటాను సర్వీస్ ప్రొవైడర్లు విధిగా భద్రపరిచి తమకు అప్పగించాలని ఆయన కోరారు. సర్వీస్ ప్రొవైడర్ల తరపున వాదించిన న్యాయవాదులు కాల్ డాటా ఇచ్చే విషయమై ఆలోచించుకోవడానికి తమకి రెండు వారాలు సమయం కావాలని కోరారు. అందుకు సమ్మతించిన కోర్టు ఈనెల 24వ తేదీలోగా ఆ కాల్ డాటాను సీల్డ్ కవర్లో తమకు సమర్పించాలని ఆదేశించింది. అంతవరకు సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డాటాను చెరిగిపోకుండా భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ అప్పటికీ సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డాటా ఇవ్వకపోయినట్లయితే వారిపై తదుపరి చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ జనరల్ కోర్టుని అభ్యర్ధించారు. ఈ కేసును కోర్టు ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.
ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు రెండూ ఒకదానినొకటి దెబ్బ తీసుకొనేందుకు లేదా ఈ సమస్య నుండి సురక్షితంగా బయటపడేందుకే ఈ ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులను కొనసాగిస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. ఓటుకి నోటు కేసులో తెదేపా అడ్డంగా దొరికిపోయింది. అదేవిధంగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేదా ఇతరుల ఫోన్లను ట్యాపింగ్ చేసినందునే తెరాస ప్రభుత్వం ఫోన్ కాల్స్ డాటా ఇవ్వడానికి వీలు లేదని సర్వీస్ ప్రొవైడర్లును ఆదేశించినట్లు అనుమానించవలసి వస్తోంది. లేకుంటే వారిని ఆవిధంగా ఆదేశించనవసరమే లేదు. ఒకవేళ వారు కాల్ డాటాను ఆంద్రప్రదేశ్ సిట్ అధికారులకి అప్పగిస్తే తెరాస పిలక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చేతిలోచిక్కుతుంది. అందుకే ఆ కాల్ డాటా కోసం సిట్ అధికారులు పట్టుబడుతున్నారని భావించవచ్చును.
ఒకవేళ సర్వీస్ ప్రొవైడర్లు ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులకి కాల్ డాటాని ఇస్తే తెలంగాణా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది కనుక వారిని అడ్డుకొనెందుకు శతవిధాల ప్రయత్నించవచ్చును. అయినప్పటికీ వాళ్ళు తన ఆదేశాలను ధిక్కరించి కాల్ డాటాని సిట్ అధికారులకి అందిస్తే తెలంగాణా ప్రభుత్వం వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడవచ్చును. ఒకవేళ వారు కాల్ డాటా ఇవ్వకపోతే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఓటుకి నోటు కేసు నుండి తనని తాను రక్షించుకొనేందుకు మార్గాలు మూసుకుపోతాయి. కనుక అప్పుడు అది వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడవచ్చును. రెండు ప్రభుత్వాలు ఆడుకొంటున్న ఈ రాజకీయ చదరంగంలో సర్వీస్ ప్రొవైడర్లు బలయిపోయేలా ఉన్నారు.
తెదేపా, తెరాసలకు ప్రజలు అధికారం కట్టబెట్టి రాష్ట్రాన్ని పరిపాలించమని కోరితే అవి ఈవిధంగా రాజకీయ క్రీడలలో మునిగితేలుతున్నాయి. పైగా ప్రజల గోళ్ళూడగొట్టి మరీ వసూలు చేస్తున్న పన్నులతో అధికారులకు జీతాలు చెల్లిస్తూ వారిని ప్రజల కోసం కాకుండా ఇటువంటి పనులకు నిసిగ్గుగా వాడుకొంటున్నాయి. ప్రజల కోసం పనిచేయవలసిన పోలీసు, సిఐడి, ఎసిబి, న్యాయవ్యవస్థలను ఈవిధంగా దుర్వినియోగం చేయడం చాలా శోచనీయం. కానీ ఇటువంటి తప్పులను ప్రశ్నించాల్సిన మేధావులు కూడా మౌనం వహించడం దురదృష్టకరం.