ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలుగురాష్ట్రాల విభజన సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదంటే కారణాన్ని రాజ్యసభలో చెప్పారు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ సరిగ్గా విభజన చేయని కారణంగానే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సమస్యలు వచ్చాయని చెబుతున్నారు. నిన్నలోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రసంగించిన మోడీ ఇవాళ రాజ్యసభలో స్పీచ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ విభజననూ ప్రస్తావించారు. మైకులు ఆపేసి చర్చ లేకుండా ఏపీని విభజించారని.. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే ప్రయోగించారని ఆరోపించారు.
విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. వాజ్‌పేయీ ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిందని.. శాంతియుత వాతావరణంలో ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత పాత్ర ఉందో బీజేపీకి అంతే ఉంది. అప్పటి బీజేపీ నేతలు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు కనుసన్నల్లోనే బిల్లుతయారు చేశారు.
రెండు పార్టీలు కలిసి పార్లమెంటరీ సంప్రదాయాలను మంటగలిపి తెలుగు రాష్ట్రాలను విభజించాయి. అయితే ఇప్పుడు మోడీ ఒక్క కాంగ్రెస్‌నే కారణంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అదేరకంగాచర్చ జరిగేలా చేస్తున్నారు. ఏడేళ్లుగా విభజన సమస్యలను పరిష్కరించకుండా విభజన హామీలను నెరవేర్చకుండా మోడీ సర్కార్ తెలుగు రాష్ట్రాలతో ఓ ఆట ఆడుకుంటోంది. వాటి గురించి కనీసమాత్రం గా కూడా ప్రధాని ప్రస్తావించలేదు.