ఫిబ్రవరి 14, మధ్యాహ్నం 3.10కి ఉగ్రదాడి..! .. కాసేపటికే.. దేశమంతా వార్త పాకిపోయింది. వార్తా చానళ్లలో హైలెట్ అయింది. అందరూ ఖండించారు. ప్రియాంకా గాంధీ ఈ విషయం తెలిసి తన ప్రెస్‌మీట్‌ను వాయిదా వేసుకున్నారు.
కానీ… మోడీ ఏం చేశారు..?
ఫిబ్రవరి 14, మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోదీ నైనిటాల్‌లోని… జిమ్ కార్బెట్ పార్క్‌లో ఉన్నారు. నాలుగు గంటల పాటు.. ఎన్నికల ప్రచార చిత్రాల కోసం షూటింగ్లో పాల్గొన్నారు.
దేశం మొత్తాన్ని కన్నీళ్లు పెట్టించిన పుల్వామా ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిన తర్వాత కూడా మోడీ ప్రమోషనల్ వీడియో షూటింగ్లో పాల్గొన్నారని కాంగ్రెస్ ఆధారాలు బయటపెట్టింది. పుల్వామా దాడి ఘటన తెలిసిన తర్వాత కూడా మోదీ స్పందించలేదని కాంగ్రెస్ చెబుతోంది. దేశం మొత్తం ఉగ్రదాడిపై కన్నీళ్లు పెడుతుంటే… మోడీ మాత్రం తన ఎన్నికల ప్రచారం కోసం డాక్యుమెంటరీ చిత్రీకరణలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా బయటపెట్టారు కంగ్రెస్ నేతలు. ఈ ఆరోపణలపై నేరుగా… బీజేపీ సమాధానం ఇవ్వడం లేదు. పుల్వామా దాడిపై రాజకీయాలు చేయవద్దని అమిత్ షా హెచ్చరించారు. మోడీ దేశం కోసం రోజుకు 18 గంటలు పని చేస్తున్నారన్నారు. కానీ.. ఆ రోజు.. మోడీ నిజంగానే షూటింగ్లో పాల్గొన్నారో లేదో చెప్పడానికి మాత్రం సంకోచిస్తున్నారు.
అదే సమయంలో… ఉగ్రదాడి జరిగిన మర్నాడే కేంద్రం అన్ని పార్టీలతో సమావేశమైంది. పుల్వామా దాడిపై ఏం చేయాలని అఖిలపక్షంతో చర్చలు జరిపింది. అయితే ఇంతటి కీలక మీటింగ్‌కు ప్రధాని రాలేదు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. అసలు బీజేపీ నుంచి ఎవరూ అఖిలపక్ష సమావేశానికి రాలేదు. కేంద్రం తరపున.. రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. కానీ.. బీజేపీ పార్టీ తరపున మాత్రం ఎవరూ రాలేదు. పుల్వామా ఉగ్రదాడిపై విపక్షాలు మొదటి నుంచి ఇంటెలిజెన్స్ వైఫల్యంపై మండిపడుతున్నాయి. మరో వైపు పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు కనీసం అమరవీరుల హోదా ఇవ్వలేదు. కేంద్రం తీరుపై రాహుల్ గాంధీ ఇప్పటికే తీవ్రంగా మడిపడ్డారు. పుల్వామా వ్యవహారంలో బీజేపీ, మోదీ తీరు ప్రజల్లో కూడా అనుమానాలను రేకెత్తిస్తోంది.అత్యంత ఘోరమైన దాడి జరిగినప్పుడు ప్రధాని కనీస రాజధర్మం పాటించలేదన్న విమర్శలు ఎక్కువుతున్నాయి. దీనికి బీజేపీ.. దేశభక్తి నినాదంతో కౌంటర్ ఇస్తోంది.