రాత్రి పది గంటల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యవసరంగా జాతినుద్దేశించి ప్రసగించబోతున్నారహో అని ప్రకటన వస్తే దేశ ప్రజలందరికీ ఓ రకమైన టెన్షన్ ఏర్పడటం ఖాయం. శనివారం అదే జరిగింది. రాత్రి తొమ్మిదిన్నరకు ప్రధానమంత్రి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ వచ్చింది. మరో పావుగంటలో మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారన్నది ఆ ట్వీట్ సారాంశం. అంతే అందరిలోనూ టెన్షన్ ప్రారంభమయింది. ఏదో అత్యవసరం ఏదో ఉందని అందరూ కంగారు పడిపోయారు.
ఎందుకైనా మంచిదని చాలా మంది ఏటీఎంల వద్దకు పరుగులు పెట్టారు. కొంత మంది ఆన్లైన్లో నిత్యావసర వస్తవులు ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకోవడంలో బిజీ అయ్యారు. దీనికి కారణం లాక్ డౌన్ భయమే. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోంది. అది ప్రమాదకరంగా మారుతోందని రెండు రోజుల నుంచి కేంద్రం ప్రకటిస్తూనే ఉంది. అయితే ఏ రాష్ట్రమూ సీరియస్‌గా తీసుకున్నట్లుగా కనిపించడం లేదు. దీంతో కేంద్రం లాక్ డౌన్ ప్రకటిస్తుందేమో అని ఎక్కువ మంది కంగారు పడ్డారు.
అయితే అలాంటిదేమీ లేదని మోడీ ప్రసంగంతో తేలిపోయింది. మోడీ ఇచ్చిన ఎమర్జెన్సీ స్పీచ్‌లో పదిహేనేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వయసు ఉన్న వారికి టీకాలు… అలాగే అరవై ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసులు ప్రారంభించడం మెయిన్ పాయింట్. బూస్టర్ డోసుకు… ప్రికాషన్ డోస్ అని పేరు పెట్టారు. ఇంత మాత్రం దానికి అంత అర్జంట్‌గా ఎందుకు జాతినుద్దేశిచి ప్రసంగించారు.. కాస్త తీరికగా.,. ముందుగా చెప్పి… ఉదయం పూటనే ప్రసంగించవచ్చు కదా అనే సందేహం.. ఇప్పటికీ చాలా మంది ప్రజల్లో ఉంది. కానీ సమాధానం ఎవరికీ దొరికదేమో..?