వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో 72, ఏపీలో 102 సీట్లు వస్తాయని కేఏ పాల్ ప్రకటించారు. గత ఎన్నికల తర్వాత అమెరికా వెళ్లిపోయి మళ్లీ వచ్చే ఎన్నికల కోసం పోటీ చేయడానికి రెండేళ్ల ముందే వచ్చిన కేఏ పాల్ .. ప్రెస్ మీట్లు పెట్టి తనదైన శైలిలో మాట్లాడుతున్నారు. బీజేపీ తనకు ఉప ప్రధాని పోస్టు ఇస్తానన్నా వద్దని చెప్పేశానన్నారు. లక్షల కోట్ల రూపాయలను ఛారిటీల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పంచి పెట్టానని చెప్పుకున్నారు.
తెలంగాణలో గ్రామ గ్రామాన పర్యటిస్తానని ప్రకటించారు. తన గురించి తాను చెప్పుకోవడానికి ఏ మాత్రం మొహమాట పడని కేఏ పాల్.. ప్రపంచంలో నాలాంటి వ్యక్తి ఒక్కరూ కూడా లేరని స్పష్టం చేశారు. ఆయన ఒక్కరే ఉన్నారని అర్థం. నా ప్రతిభ గురించి తెలిసే మోడీ, కేసీఆర్, జగన్ భయపడతారని ప్రకటించేసుకున్నారు. కేటీఆర్ తనను ప్రత్యర్థిగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లోపు దేశమంతా పర్యటిస్తా. ఇప్పటివరకూ 18 పార్టీల నాయకులను కలిపేశాను. ప్రతి ఒక్కరినీ కలుపుకొంటూ పోవాలన్నదే నా అభిమతమన్నారు. అయితే కేఏ పాల్‌ను అందరూ కామెడీగా తీసుకుంటున్నారు. ఆయన మాటలు కూడా అంతే ఉన్నాయి. కానీ పాల్ మాత్రం తన సీరియస్ నెస్ ఏ మాత్రం తగ్గకుండా.. పొలిటికల్ కామెడీ చేస్తూనే ఉన్నారు.