కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలతో ఆడుకొన్న కారణంగానే ఆ పార్టీకి ప్రజలు ఎన్నికలలో చాలా గట్టిగా బుద్ధి చెప్పారు. ఎన్నికల ప్రచార సమయంలో ‘బిడ్డ ( తెలంగాణా) కోసం కాంగ్రెస్ పార్టీ తల్లిని (ఆంద్రప్రదేశ్) నిర్దాక్షిణ్యంగా చంపేసిందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆంద్రప్రదేశ్ కి అన్నివిధాలా న్యాయం చేస్తానని మోడీ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీలన్నీ నీటిమీద వ్రాతలుగా ఒకటొకటి చెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి తెలుగు ప్రజలంటే మొదటి నుండి చాలా చులకనభావమే ఉంది. అందుకు అది తగిన మూల్యం చెల్లించింది కూడా. కానీ మోడీ ప్రభుత్వానికి కూడా తెలుగు ప్రజలంటే అంత చులకన భావం ఎందుకో తెలియడం లేదు. బహుశః తన ప్రభుత్వానికి ఎవరి మద్దతు అవసరం లేనంత మెజార్టీ వచ్చినందునే ఆవిధంగా వ్యవహరిస్తోందేమో?
విభజన చట్టంలో ప్రతీ హామీని అమలు చేస్తామని కేంద్రప్రభుత్వం పదేపదే చెపుతూ ఆ హామీలకు మళ్ళీ హామీలు ఇస్తోంది గత ఏడాదిన్నర కాలంగా. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఒక్కో హామీకి ఒక్కో కుంటిసాకు చెపుతూ ఒక్కో హామీని తీసి గట్టు మీద పెడుతోంది. ప్రత్యేక హోదాకి 14వ ఆర్ధిక సంఘం అభ్యంతరాలు, రైల్వే జోన్ ఏర్పాటుకి సాంకేతిక అవరోధాలు, నిధుల మంజూరుకి నిధుల కొరత అని రాష్ట్రానికి మొండి చెయ్యి చూపిస్తోంది. ఇప్పుడు ఆ లిస్టుకి మెట్రో రైల్ ప్రాజెక్టును కూడా చేర్చింది.
కనీసం 20 లక్షల మంది జనాభా లేకపోతే మెట్రో ప్రాజెక్టు నడపడం లాభదాయకం కాదని కనుక విజయవాడకు మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేమని తేల్చి చెప్పింది. అయితే ఈ విషయం కేంద్రప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, వైజాగ్, విజయవాడ నగరాలలో మెట్రో రైల్ ప్రాజెక్టుకి సలహాదారుగా వ్యవహరిస్తున్న మెట్రో నిపుణుడు శ్రీధరన్ కి తెలియకనే ఇంతకాలం ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారా? ఈ సంగతి తెలియకనే ఈ రెండు ప్రాజెక్టులకు కోట్లు ఖర్చు చేసి నివేదిక, డిజైన్, అంచనాలు సిద్దం చేశారా?అనే ప్రశ్నలకు వారే జవాబు చెప్పాలి. ఒకవేళ ఈ సంగతి తెలిసే ఈ ప్రాజెక్టుపై డి.పి.ఆర్. (డిటెల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) తయారు చేసేందుకు కోట్లు ఖర్చు చేసారనుకొంటే ఇంతకాలం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించినట్లు భావించాల్సి ఉంటుంది. అందుకోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేసినట్లు భావించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడయినా ఈ సంగతి బయటపెట్టి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసాయనే సంతోషపడక తప్పదు. లేకుంటే ప్రజలను మభ్యపెట్టేందుకు మరో నాలుగేళ్ళపాటు ఈ ప్రాజెక్టు కోసం మరో వెయ్యి కోట్లు ఖర్చు చేసాక అప్పుడు చెపితే విని తట్టుకోవడం ఇంకా కష్టం. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు అప్పుడప్పుడు పట్టాలు తప్పుతున్నా మళ్ళీ సర్దుకొని ముందుకు సాగుతోంది. కానీ ఆంధ్రాలో మెట్రో రైల్ పట్టాలు ఎక్కకముందే మాయమయిపోయింది. కనుక ఇక పట్టాలు తప్పే అవకాశం కూడా లేదు.
ప్రత్యేక హోదా, ఇప్పుడు ఈ మెట్రో రైల్ ప్రాజెక్టును గట్టున పెట్టిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో వరుసగా శంఖుస్థాపనలు చేస్తున్న ఉన్నత విద్యాసంస్థలు, రాజధాని నిర్మాణం, పోలవరం వంటి వివిధ ప్రాజెక్టులకు కూడా చివరికి ఇదే గతి పట్టిస్తాయేమో? రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ ఐదేళ్ళు పబ్బం గడుపుకోవడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ నాటకాలు ఆడుతున్నయేమోననే అనుమానం కలుగుతోంది. లేకుంటే మెట్రో రైల్ ప్రాజెక్టులపై ఇంతవరకు ఎందుకు కధ నడిపించాయి? సరిగ్గా నిర్మాణం మొదలవవలసిన సమయంలో ఎందుకు ఈ సంగతి బయటపెట్టారు? అనే ప్రశ్నకు జవాబు చెప్పవలసి ఉంటుంది.