- ఔను.. మీ భాషలోనే “చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు..” ..! అయితే ఏంటి..?
- దానికి ప్రత్యేకహోదా సహా విబజన హామీలు అమలు చేయకపోవడానికి ఏమైనా లింక్ ఉందా..?
- ఔను..కాంగ్రెస్కు వ్యతిరేకంగానే టీడీపీ పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్తో కలిశారు..! అయితే ఏంటి..?
దానికి ప్రత్యేకహోదా సహా విబజన హామీలు అమలు చేయకపోవడానికి ఏమైనా లింక్ ఉందా..?
విభజన హామీలు చేయమని.. అడిగిన వారికి.. బీజేపీ నేతల నుంచి వస్తున్న సమాధానం.. చంద్రబాబు వెన్నుపోటు, కాంగ్రెస్ తో పొత్తులే అవుతున్నాయి. అది మోడీ దగ్గర్నుంచి విష్ణువర్దన్ రెడ్డి అనే నోరున్న నేత వరకూ… అందరికీ అవే.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచార శైలి సహజంగా… నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిపై ఎప్పుడూ ఉండదు. నెహ్రూ, ఇందిర కాలం నాటి విషయాలను.. కొత్తగా చెప్పి… కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచాలనుకుంటారు. నెలన్నర కిందటే ఆయన ఎన్నికల ర్యాలీలు ప్రారంభించినప్పటికీ.. ఒక్క సభలోనూ ఆయన నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి వాటిని కాదు కదా.. ఈ ఐదేళ్ల కాలంలో.. తమ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం ఇదంటూ.. ఏదీ ప్రకటించుకోలేకపోయారు. ఇదే వ్యూహాన్ని ఏపీకి వచ్చి అమలు చేస్తారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పదవి లాక్కున్నారని… కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టారని.. ఆయన చరిత్ర గురించి ప్రస్తావిస్తారు. ఏపీకి రాక ముందే తమిళనాడు, తెలంగాణల్లోనే ఇది చెప్పారు. ఇక ఏపీకి వస్తే చెప్పకుండా ఉంటారా..? ఇలాంటి రాజకీయ విమర్శలు… చేసినన్నీ చేసుకోవచ్చు,. దానికి టీడీపీ కౌంటర్ ఇస్తుంది. కానీ.. ప్రజలు వేస్తున్న ప్రశ్నలకు.. చేస్తున్న డిమాండ్లకు.. మోదీ సమాధానం చెబుతారా.. లేదా.. అన్నదే ఇక్కడ అసలు పాయింట్.
- ప్రత్యేకహోదా ఎందుకివ్వలేదు..? ప్యాకేజీ నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఎందుకివ్వలేదు..?
- ఆర్థికంగా భారం కాకపోయినా రైల్వేజోన్ ఎందుకివ్వలేదు.. ?
- స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకివ్వలేదు..?
- పోర్టు విషయంలో ఒక్క అడుగు ఎందుకు ముందుకేయలేకపోయారు..?
- లోటు భర్తీ విషయంలో కొర్రీలెందుకు పెడుతున్నారు..?
- పెట్రోలియం కాంప్లెక్ ఏమైంది..?
- ట్రైబల్ యూనివర్శిటీ సంగతేమిటి..?
- ఢిల్లీని మించిన రాజధానికి రూ. 1500 కోట్లా..?
- వెనుకబడిన జిల్లాలకు నిధులేమయ్యాయి..?
ఇలా చెప్పుకుంటూ పోతే.. దాదాపుగా విభజన చట్టం మొత్తం వల్లే వేయాల్సి ఉంటుంది. లక్షల కోట్లిచ్చిచ్చామని డప్పుకొడితే.. ప్రజలు నమ్మరు కదా..! పన్నుల్లో వాటాలు.. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైనా.. ఏపీ నుంచి కేంద్రానికి పన్నుల నుంచే ఇస్తున్నారు. అది గుజరాత్ నుంచో… యూపీ నుంచో మోదీ, షా తెచ్చివ్వడం లేదు. ఆ విషయంలో ఏపీ ప్రజలకు క్లారిటీ ఉంది. అందుకే.. ఈ మాటలన్నీ కాదు.. విభజన హామీల విషయంలో స్పష్టమైన సమాధానం చెబితేనే.. మోదీ పర్యటన… బీజేపీకి అయినా ఉపయోగపడుతుంది. లేదు.. ఏదో చంద్రబాబును.. టీడీపీని విమర్శించడానికే అంటే.. ప్రజల చేత ఛీకొట్టించుకుటారు. ఎందుకంటే.. ఎన్టీఆర్, టీడీపీ విషయంలో చంద్రబాబు చేసింది కరెక్ట్ అని ప్రజలు అనుకున్నారు కాబట్టే.. ఆయనకు మద్దతుగా నిలిచారు. అప్పట్లో స్వయంగా ఎన్టీఆరే ప్రజల్లోకి వెళ్లినా… మద్దతు దక్కలేదు. ఇప్పుడు వాటిని కొత్తగా చెప్పి రాజకీయం చేస్తే చేసుకోవచ్చు కానీ.. రాష్ట్ర ప్రయోజనాలపై మాత్రం సమాధానం చెప్పి తీరాల్సిందే..!