నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చాలా సంస్కరణలు అమలుచేశారు. పెద్ద పెద్ద సమస్యలకి చిన్న చిన్న ఉపాయాలతో పరిష్కారం చేస్తున్నారు. ఉదాహరణకి ఉన్నత ఆదాయ వర్గాలని స్వచ్చందంగా తమ గ్యాస్ సబ్సిడీ వదులుకోవలసిందిగా మోడీ చేసిన అభ్యర్ధన అటువంటిదే. దానికి చాలా అపూర్వమైన స్పందన వచ్చింది. అప్పటికీ ఇంకా దేశంలో కోట్ల మంది ఉన్నతాదాయ వర్గాలు తమ సబ్సిడీని వదులుకోకపోవడంతో రూ.10 లక్షల ఆదాయం పరిమితి విధించారు. దానితో అంతకంటే ఎక్కువ ఆదాయం పొందుతున కొన్ని కోట్ల మందికి గ్యాస్ సబ్సిడీ కట్ అయిపోయింది. ప్రభుత్వ ఖజనాకి కొన్ని వేలకోట్లు మిగిలాయి. దానితోనే నిరుపేద కుటుంబాలకి గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు.
ఇటువంటి సరికొత్త ఆలోచనలతో ప్రభుత్వంలో దాని విదివిదానలలో చాలా మార్పులు చేర్పులు చేస్తూ ఖజానాపై ఆర్ధికభారం తగ్గించి, కొత్త ఆదాయ మార్గాలని సృష్టిస్తూ దేశాన్ని ఆర్ధికంగా పటిష్టం చేస్తున్నారు. అటువంటి మరో ప్రయత్నమే జి.ఎస్.టి.పన్ను విధానం కూడా. ఇప్పుడు మరో సరికొత్త ఆలోచనని అమలుచేయడానికి మోడీ ప్రభుత్వం సిద్దం అవుతోంది.
బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని ఒక నెల ముందుకు జరుపడం, రైల్వే బడ్జెట్ ని ఆర్దిక బడ్జెట్ లోనే కలిపివేయడం, మార్చి 31న నూతన ఆర్ధిక సంవత్సరం మొదలయ్యేలోగానే బడ్జెట్ పై చర్చలు జరిపి ఆమోదించడం, తద్వారా ఓట్-ఆన్-అకౌంట్ ద్వారా ప్రభుత్వ నిర్వహణ కోసం నిధులు వాడుకొనే పద్దతికి స్వస్తి చెప్పడం, బడ్జెట్ పుస్తకం సైజ్ తగ్గించడం వంటి ప్రతిపాదనలని సిద్దం చేస్తోంది. ఈ మార్పుల వలన బడ్జెట్ ఆమోదం కోసం పార్లమెంటు సమావేశాలు నిర్వహించే సమయం కూడా చాలా తగ్గిపోతుంది కనుక ఆ మేరకు ఖజానాపై ఆర్ధిక భారం కూడా తగ్గుతుంది. దీనిపై త్వరలోనే ప్రతిపక్షాలతో చర్చలు జరిపి అందరి ఆమోదంతో ఈ నూతన పద్ధతులని అమలుచేయాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది.
మోడీ ప్రభుత్వం అమలుచేయాలనుకొంటున్న ఈ సరికొత్త ఆలోచనలో లోటుపాట్లని, లాభానష్టాలని సంబంధిత వర్గాల నిపుణులు మరింత లోతుగా విశ్లేషించి తమ అభిప్రాయలు, విలువైన సూచనలు, సలహాలు ఎలాగూ ఇస్తారు. కానీ స్థూలంగా చూసినట్లయితే దీనివలన చాలా లాభాలున్నట్లు కనిపిస్తోంది.
ఆర్ధిక సంవత్సరం మొదలయ్యేలోగానే పూర్తి స్థాయి బడ్జెట్ సిద్దం చేయడం వలన ఆ సంవత్సర ప్రణాళికపై పూర్తి స్పష్టత ఏర్పడుతుంది. ఓట్-ఆన్-అకౌంట్ ద్వారా నిధులు వాడుకొనే అవసరం ఉండదు. ఇంతకాలం రైల్వే బడ్జెట్ వేరేగా సమర్పిస్తుండటం వలన ఆ శాఖకి మంత్రిగా ఉన్న రాజకీయనేతలు ఓటు బ్యాంక్ రాజకీయాలని దృష్టిలో ఉంచుకొని చాలా అనవసరమైన లేదా సాధ్యం కాని అనేక హామీలు అందులో గుప్పిస్తుండేవారు. రైల్వే బడ్జెట్ ని ఆర్ధిక బడ్జెట్ లో కలిపివేస్తే అటువంటి చిల్లర రాజకీయాలకి అడ్డుకట్ట పడుతుంది. మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రతిపాదనలు ఆచరణలో పెడితే ఇటువంటి ప్రయోజనాలు ఇంకా చాలానే కలుగవచ్చు. కనుక ఈ ప్రతిపాదనని స్వాగతించవచ్చు.