ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం బాగోలేదని ఆయన అనారోగ్యం వెనుక కుట్ర ఉందని మోదీ ఆరోపించారు. ఆయనకు అనారోగ్యం రావడానికి కారణం ఎవరో తాము అధికారంలోకి వస్తే విచారణ చేయిస్తామని ఒరిస్సాలో ప్రకటించారు. దీనికి కారణం అంతకు ముందు బీజేపీ ఓ వీడియో విడుదల చేసింది. నవీన్ పట్నాయక్ తన చేతిని నిలకడగా ఉంచలేకపోతున్నారు. ఆయనకు వణుకుడు సమస్య ఉందన్నట్లుగా ఆ వీడియో ఉంది. వణుకుతున్న వీడియోను.. ఆయన రాజకీయ వారసుడిగా పేరు తెచ్చుకున్న పాండియన్ తీసి కనిపించకుండా పెట్టడం వీడియోలో ఉంది.
ఈ వీడియోను విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చిన బీజేపీ… నవీన్ ఆరోగ్యం బాగోలేదని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. వయసు కారణంగా నవీన్ పట్నాయక్ అంత చురుగ్గా లేరు. ఆయన తరపున మాజీ ఐఏఎస్ అధికారి.. ప్రస్తుతం బీజేడీని నడుపుతున్న పాండియన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనే మీడియాకు ఇంటర్యూలు ఇస్తున్నారు. పట్నాయక్ బహిరంగసభల్లో అతి కష్టం మీద ప్రసంగిస్తున్నారు. దీన్ని బీజేపీ అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. చివరికి ప్రధాని కూడా అదే చెబుతున్నారు.
బీజేడీని మళ్లీ గెలిపిస్తే పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉండరని.. తమిళనాడు వ్యక్తి సీఎం అవుతారని అంటున్నారు. ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే ప్రజల్లో నవీన్ పట్నాయక్ పై ఏ మాత్రం అభిమానం తగ్గలేదు. అందుకే పట్నాయక్ కూడా బీజేపీకి అదే కోణంలో కౌంటర్ ఇస్తున్నారు. తనను మోదీ ఎన్నో సార్లు మిత్రుడన్నారని.. అంతగా ఆయనకు బాధ ఉంటే.. ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కోవచ్చు కదా అని సెటైర్లు వేశారు.
బీజేడీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నించింది. మెజారటీ సీట్లు తీసుకోవాలని అనుకుంది. కానీ నవీన్ పట్నాయక్ అంగీకరించకపోవడంతో పొత్తు సాధ్యం కాలేదు.