కాంగ్రెస్ను టార్గెట్ చేసుకుని రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన విభజన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ ఒక్క సారిగా బీజేపీపై విరుచుకుపడ్డాయి. తెలంగాణ సమాజాన్ని అవమానించారని చెప్పడమే కాదు అసలు మాట తప్పిన బీజేపీ వందల మంది తెలంగాణ బిడ్డలు బలైపోవడానికి కారణమని చరిత్రను బయటకు తీస్తున్నారు. అనూహ్యంగా అటు రేవంత్ రెడ్డి.. ఇటు హరీష్ రావు మోడీ వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీని టార్గెట్ చేయడానికి ఒకే అస్త్రం ఎంచుకున్నారు. అదే ఒక ఓటు – రెండు రాష్ట్రాలన్న ఒకప్పటి బీజేపీ కాకినాడ తీర్మానం.
1999లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని బీజేపీ కాకినాడ తీర్మానం చేసి బీజేపీ ఏడు స్థానాలు గెల్చుకుని కేంద్రంలో అధికారంలోకి వచ్చి తెలంగాణను ఏర్పాటు చేయకుండా మోసం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. 1999 నుంచి 2004 వరకు అధికారంలో ఉండి మూడు రాష్ట్రాలు ఇచ్చింది. కానీ తెలంగాణ ఇవ్వలేదని ఈ కారణంగానే 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేయాల్సి వచ్చిందని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మోడీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అనూహ్యంగా తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఇదే మాట అ్నారు. 1999 లో కాకినాడ తీర్మానం చేసి, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మోసం చేశారు..నాడు బీజేపీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇవ్వకుండా దగా చేశారని ఆరోపించారు. 2004 లోనే తెలంగాణ ఇస్తే ఇంత మంది విద్యార్థులు అమరులు అయ్యేవారా.. శ్రీకాంత చారి లాంటి వారు బలిదానాలు ఇచ్చేవారా అని ప్రశ్నించారు. ఇతర టీఆర్ఎస్ నేతలు కూడా తెలంగాణ ఏర్పాటు బీజేపీకి ఇష్టం లేదని మోడీ మాటల ద్వారా తెలిసిపోయిందంటున్నారు.
మోడీ వ్యాఖ్యలను కవర్ చేయడానికి బీజేపీ ముఖ్యనేతలు ఎవరూ మీడియా ముందుకు రాలేదు. ఈ వ్యాఖ్యలపై వీలైనంత లో ప్రోఫైల్ మెయిన్ టెయిన్ చేయాలని ఆ పార్టీ నేతలు అనుకునే అవకాశం ఉంది. వీలైనంత రచ్చ చేయాలని కాంగ్రెస్, టీఆర్ఎస్ భావిస్తాయి. రేవంత్ రెడ్డి ఇప్పటికే మోడీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు.