తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలిసిన విషయమే. లోక్ సభ ఎన్నికలు వచ్చేనాటికి అసెంబ్లీ పనైపోతే… జాతీయ రాజకీయాలపై ప్రశాంతంగా ఫోకస్ చెయ్యాలనుకున్నది ఆయన లక్ష్యం. అయితే, తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేంద్రం నుంచి మద్దతు లభించలేదా? మోడీ సర్కారు నుంచి సానుకూల సంకేతాలు రాకుండానే ఎన్నికలు జరిగిపోయాయా? తెలంగాణలో ముందస్తు వల్ల అదనంగా ఎన్నిక నిర్వహణ వ్యయం పెరిగిపోతుందని కేంద్ర ప్రభుత్వం భావించిందా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఎందుకూ అంటే… తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలానే మాట్లాడారు కాబట్టి.
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రశ్నించారు మోడీ. జ్యోతిష్కుడు చెప్పాడని అసెంబ్లీ రద్దు చేస్తారనీ, జోత్యిష్కుడు చెప్పాడని మంత్రి వర్గ విస్తరణ కూడా వాయిదా వేశారంటూ ఎద్దేవా చేశారు. ముందస్తుకు వెళ్లకుండా, ఈ సార్వత్రిక ఎన్నికల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఉంటే వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కాకుండా ఉండేదన్నారు ప్రధాని. మేలో కేసీఆర్ జాతకం బాగులేదనీ, మోడీ జాతకం బాగుందని జ్యోతిష్కుడు చెప్పాడు కాబట్టే కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసేశారన్నారు. తెలంగాణ భవిష్యత్తును జ్యోతిష్కుల చేతుల్లో పెడతారా అంటూ ప్రశ్నించారు?
ఇందతా బాగానే ఉందిగానీ… కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసేందుకు సిద్ధమౌతున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేసినట్టు? అసెంబ్లీ రద్దు చేస్తే…. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే కంగారులో కేసీఆర్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పుడు ఆయనకి భరోసా కల్పించింది మోడీ కాదా? ఆఘమేఘాల మీద అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని ఆమోదించేయడం, ఆ వెంటనే కేంద్రంలోని అధికార యంత్రాంగం స్పందించేయడం, అదే సమయంలో ఒకటికి రెండుసార్లు కేసీఆర్ కి ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడం, ఎన్నికల నోటిఫికేషన్ రావడం… ఇదంతా ప్రజలకు అర్థం కాని, లేదా జనాలు మర్చిపోయిన తంతు అని మోడీ అనుకుంటున్నట్టున్నారు. ఒకవేళ నిజంగానే ఎన్నికల వ్యయం గురించి అంత బాధ్యతాయుతంగా మోడీ ఆలోచించి ఉంటే… తన దగ్గరకి తరచూ వస్తున్న కేసీఆర్ ను నాడు బుజ్జగించి ఉండొచ్చు కదా. ఈ కబుర్లేవో అప్పుడు చెప్పి ఉండొచ్చు. అంతా అయిపోయాక.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగిపోయాయా అంటూ ఆశ్చర్యంగా మాట్లాడటం ఎందుకు?