ప్రధాని మోదీ నన్ను రేపు చీల్చి చెండాడుతాడు అని కేసీఆర్ ఆవేశంగా ఒక రోజు ముందే ప్రకటించుకున్నారు. కానీ మోదీ ఆయనను అంత సీరియస్‌గా తీసుకోలేదు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడారు. అయితే ఆయన నోటి వెంట కేసీఆర్ అనే మాటే రాలేదు. ఇంకా చెప్పాలంటే అసలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించలేదు. కేసీఆర్ పాలన తీరు దారుణంగా ఉందనో.. వారసత్వ రాజకీాయల్ని ప్రోత్సహిస్తున్నారో విమర్శించలేదు.
అయితే కేంద్రం చేసిన సాయాన్ని… తెలంగాణ ప్రజలకు అందుతున్న పథకాల గురించి మాత్రం వివరించారు. తెలంగామకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం పక్కా అని తేల్చేశారు. మోదీ ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావన లేకపోవడం.. విమర్శలు లేకపోవడంతో ఫ్లాట్‌గా ముగిసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అయితే దేశ్ కీ నేతగా రూ. వందల కోట్లు పెట్టి ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్‌కు వ్యూహాత్మకంగా కావాలనే మోదీ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల విషయంలో బీజేపీని ఎంత రెచ్చగొట్టినా.. మోదీ పట్టించుకోలేదు. పోటీగా పోస్టర్లు.. ప్రచారం దక్కకుండా వ్యూహాలు.. బీజేపీ నేతల్ని పార్టీలో చేర్చుకోవడం వంటి వ్యూహాలను అమలు చేసినా మోదీ.. కేసీఆర్ పేరు కూడా ఎత్తలేదు. ఆయనకు అనవసరంగా ప్రాధాన్యత ఇస్తే దేశవ్యాప్తంగా ప్రాచుర్యం తెచ్చినట్లవుతుందన్న ఉద్దేశంతో మోదీ లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
మోదీ ఎలాంటి విమర్శలు చేయకపోవడంతో ముందుగా టీఆర్ఎస్ నేతలే నిరాశకు గురయ్యారు. తమను బీజేపీ ప్రత్యర్థిగా గుర్తిస్తే.. దేశవ్యాప్తంగా బీజేపీకి తామే పోటీ అన్నట్లుగా రేస్‌లోకి వస్తామని అనుకున్నారు. కానీ అసలు పట్టించుకోకపోవడంతో వారి కోరిక తీరలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.