నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరుగుతోంది. స్వయంగా ప్రధాని మోదీ హాజరవుతున్నారు. కానీ ఆ కార్యక్రమానికి నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు అయిన రఘురామకృష్ణరాజుకు ఆహ్వానం లేదు. ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానంతో సంబంధం లేకుండా ఆయన పాల్గొనే అవకాశం ఉంది. అందుకు ఆయన రెడీ అయ్యారు. కానీ ఆయన పేరు ఎక్కడా లేదు. ఎంపీ పేరు ఏ జాబితాలోనూ లేదని డీఐజీ పాల్ రాజ్ ప్రకటించారు. దీంతో రఘురామకృష్ణరాజు భీమవరం వెళ్తే అరెస్ట్ చేయకపోవచ్చు కానీ తనను వేదిక మీదకు వెళ్లనీయకుండా ఘోరంగా అవమానిస్తారని అనుమానించి ఆగిపోయారు.
ప్రధాని కార్యక్రమం ఏదైనా నియోజకవర్గంలో ఉందంటే అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి తర్వాత ఎంపీకే ప్రాధాన్యం లభిస్తుంది. ఉండకపోవడానికి చాన్సే లేదు. అక్కడ వ్యక్తి కాదు..ఎంపీ అనే పదవి కీలకం. అది ప్రజలిచ్చినది. ప్రజాప్రతినిధి పేరు లేకుండా ఎవరూ చేయలేరు. కానీ ఇక్కడ రఘురమకృష్ణరాజు విషయంలో చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలోనూ రఘురామ పేరు లేదని అధికారులు ప్రకటించారు. విమానాశ్రయంలో స్వాగతం చెప్పే వారిలో… అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వేదికపైనా.., ఇలా ఏ కార్యక్రమం జాబితాలోనూ రఘురామ పేరు లేదని పాల్ రాజు చెప్పేశారు. ఇలా ఎందుకు జరిగిందో తెలియాల్సి ఉంది.
ప్రజాస్వామ్యంలో ఓ నియోజకవర్గ ఎంపీని ఆ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనకుండా నియంత్రించడం అనూహ్యం. అది ప్రధానమంత్రి కార్యాలయం అయినా కావొచ్చు.. రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు అయినా కావొచ్చు.. ఆయన వ్యక్తిగత స్వచ్చను.. ప్రజలు ఇచ్చే బాధ్యతను నిర్వర్తించే హక్కును కాలరాస్తున్నట్లే. ఏపీలో అడుగుపెడితే అరెస్ట్ చేస్తామనే బెదిరింపుల మధ్య ఆయన ప్రతీ సారి పర్యటన పెట్టుకోవడం.. చివరికి ఆగిపోవడం కామన్‌గా అయిపోయింది. ఇలాంటి ఆందోళనల మధ్య ఓ ఎంపీ బతుకుతున్నారంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాద ఘంటికలు మోగినట్లే అనుకోవాలి.
భీమవరం వెళ్తే తనకు ఎంపీగా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొననీయరని అర్థమైన తర్వాతనే రఘురామకృష్ణరాజు తన పర్యటనను బయలుదేరిన తర్వాత కూడా ఉపసంహరించుకున్నారు. కానీ ఆయన తనకు ఎదురైన పరిస్థితుల్ని మాత్రం ప్రభావవంతంగా ప్రజల ముందు ఉంచారు.